Begin typing your search above and press return to search.

సీబీఐ ఎదుట నోరు విప్పని బొల్లినేని

By:  Tupaki Desk   |   4 May 2021 12:30 PM GMT
సీబీఐ ఎదుట నోరు విప్పని బొల్లినేని
X
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ ఇటీవల అరెస్ట్ చేసిన మాజీ సీజీఎస్టీ అధికారి బొల్లినేని శ్రీనివాసగాంధీ మొండికేస్తున్నారు. సీబీఐకి సహకరించడం లేదు. విచారణలో ఏమాత్రం నోరు తెరవడం లేదని అధికారవర్గాల్లో ప్రచారం సాగుతోంది.

మే 1 నుంచి 4 వరకు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఇటీవల కోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలోనే సోమవారం కూడా బొల్లినేనిని అధికారులు చంచల్ గూడ జైలు నుంచి కోఠిలోని సీబీఐ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఎన్ని విధాలా ప్రశ్నించినా తనకు ఆనారోగ్యం ఉందని సమాధానాలను బొల్లినేని దాటవేశాడు.

ఇక సీబీఐ అధికారులు ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు. రెండు రాష్ట్రాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టిన విధానం.. వాటి డాక్యుమెంట్లు ముందు పెట్టి ప్రశ్నలు సంధించినా నోరు తెరవలేదని సమాచారం.

మంగళవారంతో బొల్లినేని కస్టడీ ముగియనుంది. ఆఖరు రోజైన సమాధానాలు రాబట్టాలని సీబీఐ అధికారులు పట్టుదలగా ఉన్నారు. విచారణ అనంతరం బొల్లినేనిని తిరిగి చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు.

అక్రమ ఆస్తులను కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీజీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ బొల్లినేని శ్రీనివాస గాంధీని సీబీఐ గతంలో అరెస్ట్ చేసింది. 3.8 కోట్ల రూపాయల విలువైన అక్రమ ఆస్తులను కూడబెట్టినట్లు ఆరోపిస్తూ బొల్లినేని శ్రీనివాస గాంధీ, ఆయన భార్యపై సీబీఐ కేసు నమోదు చేసింది. బొల్లినేని మాజీ సిజిఎస్టి కమిషనర్ గా ఉండగా ఈ అరెస్ట్ జరిగింది.

గతంలో బొల్లినేని ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్).. డీఆర్‌ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) లో కూడా పనిచేశారు. గతంలో ఇప్పటి సీఎం జగన్ ను అక్రమాస్తుల కేసులో ఈడీ లో ఉండగా బొల్లినేని తెగ ఇబ్బందిపెట్టినట్టు ఆరోపణలున్నాయి.