Begin typing your search above and press return to search.

బైరెడ్డి సిద్ధార్థ్ ను తోసేసిన సీఎం సెక్యూరిటీ!

By:  Tupaki Desk   |   19 Feb 2020 2:08 PM GMT
బైరెడ్డి సిద్ధార్థ్ ను తోసేసిన సీఎం సెక్యూరిటీ!
X
కర్నూలు ఫైర్ బ్రాండ్ నేతల్లో ఒకరైన బైరెడ్డి రాజశేఖరరెడ్డి సోదరుడి కొడుకు సిద్ధార్త్ రెడ్డికి ఈరోజు ఓ కార్యక్రమంలో అవమానం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం ఉన్న బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కర్నూలు జిల్లాలో అందరికీ సుపరిచితం. వైసీపీ తరఫున కీలకంగా పనిచేస్తున్నారు. మంగళవారం కంటివెలుగు కార్యక్రమానికి జగన్ కర్నూలు జిల్లాకు వచ్చారు. కంటివెలుగు కార్యక్రమం వద్ద జగన్ ను కలవడానికి ఆయన ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అనుమతించలేదు. తర్వాత కొద్దిసేపటికి ఆయన మరోసారి ప్రయత్నించారు. ఈ సందర్భంగా కాన్వాయ్ వద్ద నడుచుకుంటూ శిబిరం వద్దకు వెళ్తున్న బైరెడ్డిని జగన్ భద్రతా సిబ్బంది పక్కకు తోసేశారు. దీంతో ఆగ్రహించిన సిద్ధార్థ్ వారితో గొడవపడ్డారు. భద్రతా సిబ్బంది స్థానిక పరిస్థితులను అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారు అంటూ వారితో సిద్ధార్థ్ వాగ్వాదానికి దిగారు.

ఈ వ్యవహారాన్ని గమనించిన వైసీపీ నేతలు కలగజేసుకుని సెక్యూరిటీ సిబ్బందికి విషయం వివరించారు. సిద్ధార్త్ కి కూడా సర్దిచెప్పారు. దీంతో ఆయన శాంతించారు. కానీ ఈ పరిణామాన్ని మాత్రం బైరెడ్డి వర్గం జీర్ణించుకోలేకపోతోంది. జిల్లాలో వైసీపీ బలోపేతానికి ఎంతో కృషిచేస్తున్న మా అన్నను అవమానిస్తారా అంటూ బైరెడ్డి అనుచర వర్గం తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తోంది. పార్టీ ప్రొటోకాల్ అయినా పాటించాలి. పార్టీ జిల్లాలో ఈ స్థాయిలో విజయవంతం కావడానికి కీలక వ్యక్తుల్లో ఒకరైన మా అన్ను అవమానిస్తారా అంటూ వైసీపీ అధిష్టానంపై బైరెడ్డి వర్గం సోషల్ మీడియాలో దాడిచేస్తోంది. మరి సిద్ధార్థ్ పూర్తిగా శాంతించి ఈ ఇష్యూని వదిలేస్తారా... ? లేకపోతే దీనిని మనసులో పెట్టుకుంటారా అన్నది కొంతకాలం ఆగితే గాని తెలియదు.