Begin typing your search above and press return to search.

హుజూరాబాద్‌లో ఇలా.. బ‌ద్వేల్లో అలా

By:  Tupaki Desk   |   21 Oct 2021 4:27 AM GMT
హుజూరాబాద్‌లో ఇలా.. బ‌ద్వేల్లో అలా
X
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో అక్టోబ‌ర్ 30న ఉప ఎన్నిక పోలింగ్ జ‌రుగుతుంది. కానీ ఇప్పుడా రెండు నియోజక‌వ‌ర్గాల్లో ప‌రిస్థితులు ప‌ర‌స్ప‌రం విరుద్ధంగా ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. ఒక చోట హోరాహోరీ ప్ర‌చారాలు.. ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు.. విజ‌యం కోసం అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల క‌స‌ర‌త్తులు.. వ్యూహాలు, ప్ర‌ణాళిక‌లు.. ఇలా రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. మ‌రో చోట మాత్రం అస‌లు ఉప ఎన్నిక అన్న సంద‌డే లేకుండా పోయింది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం పోటీకి దూరంగా ఉండ‌డంతో అస‌లు మ‌జా క‌నిపించ‌డం లేదు. ఇంత‌కీ ఆ రెండు నియోజ‌వ‌ర్గాలు ఏమిటంటే.. ఒక‌టి తెలంగాణ‌లోని హుజూరాబాద్‌.. రెండోది ఆంధ‌ప్ర‌దేశ్‌లోని బ‌ద్వేలు.

భూ క‌బ్జా ఆరోప‌ణ‌ల‌తో ఈ ఏడాది జూన్‌లో త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి టీఆర్ఎస్ నుంచి ఈట‌ల రాజేంద‌ర్ బ‌య‌ట‌కు రావ‌డంతో మొద‌లైన రాజ‌కీయ మంట ఇంకా పెరుగుతూనే ఉంది. ఆయ‌న రాజీనామాతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యం కాగా.. నోటిఫికేష‌న్ రాక‌ముందే అధికార టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఓ వైపు ఈట‌ల రాజేంద‌ర్ మ‌రోవైపు విజ‌యం కోసం వ్యూహాల‌కు ప‌దును పెట్టారు. ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా ఆ నియోజ‌క‌వ‌ర్గంలోనే మొద‌లెట్ట‌డంతో పాటు ఇత‌ర పార్టీల‌కు చెందిన కీల‌క నేత‌ల‌ను గులాబి గూటికి చేర్చుకున్న కేసీఆర్ విజ‌యం కోసం అన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌రోవైపు బీజేపీ తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ త‌ర‌పున ఎన్నిక‌ల బరిలో నిలిచిన మాజీ మంత్రి ఈట‌ల‌.. ఎలాగైనా గెలిచి కేసీఆర్‌ను దెబ్బ కొట్టేందుకు శ‌క్తివంచ‌న లేకుండా శ్ర‌మిస్తున్నారు. ఇక విద్యార్థి నాయ‌కుడు బ‌ల్మూరి వెంక‌ట్‌ను పోటీలో నిల‌బెట్టిన కాంగ్రెస్ కూడా గౌర‌వ‌ప్ర‌ద‌మైన ఫ‌లితాలు రాబ‌ట్టేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

మ‌రోవైపు అధికార వైసీపీ ఎమ్మెల్యే వెంక‌ట‌సుబ్బ‌య్య మ‌ర‌ణంతో క‌డ‌ప జిల్లాలోని బ‌ద్వేలు నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక నిర్వ‌హిస్తున్నారు. వైసీపీ త‌ర‌పున వెంక‌ట‌సుబ్బ‌య్య భార్య సుధ పోటీ చేస్తోంది. చ‌నిపోయిన ఎమ్మెల్యే కుటుంబ స‌భ్యులే బ‌రిలో ఉన్నారు కాబ‌ట్టి ఎన్నిక ఏక‌గ్రీవం కావాల‌నే ఉద్దేశంతో రాజ‌కీయ విలువ‌ల‌ను పాటించి సంప్ర‌దాయాన్ని కొన‌సాగించాల‌ని ఆకాంక్షిస్తూ జ‌న‌సేన, టీడీపీ ఈ ఉప ఎన్నిక పోటీ నుంచి త‌ప్పుకున్నాయి. కానీ జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మాత్రం త‌మ అభ్య‌ర్థుల‌ను ఎన్నిక‌లో పోటీకి నిలిపాయి. బీజేపీ త‌ర‌పున విద్యార్థి నాయ‌కుడు సురేశ్, కాంగ్రెస్ నుంచి పీఎం క‌మ‌ల‌మ్మ ఎన్నిక‌లో త‌ల‌ప‌డుతున్నారు.

ఈ బ‌ద్వేలు ఉప ఎన్నిక‌లో అధికార వైసీపీదే విజ‌యమ‌ని అంతా అనుకుంటున్నారు. ఆ పార్టీ గెలుపు న‌ల్లేరు మీదే న‌డ‌కే అని రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం చెబుతున్నారు. ఎందుకంటే బీజేపీ, కాంగ్రెస్‌ల‌కు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు లేదు. పైగా గ‌త ఎన్నిక‌ల్లో ఆ పార్టీల‌కు ఘోర‌మైన ఫ‌లితాలు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో హోరాహోరీ వాతావ‌ర‌ణం అక్క‌డ క‌నిపించ‌డం లేదు. కానీ అదే హుజూరాబాద్‌లో అయితే ప్ర‌ధాన పోటీ కేసీఆర్ వ‌ర్సెస్ ఈట‌ల రాజేంద‌ర్ అన్న‌ట్లు ఉంది కాబ‌ట్టి.. ఇక్క‌డ సంద‌డి ఎక్కువ‌గా ఉంది.