ఏపీలో ఉప ఎన్నికలొస్తున్నాయ్...

Sat Jul 20 2019 20:00:01 GMT+0530 (IST)

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరిగి రెండు నెలలు కూడా కాకుండానే రాజకీయంగా ఎన్నో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయిన కేవలం 23 అసెంబ్లీ సీట్లకు పరిమితం కావడంతో ఆ పార్టీలో రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించిన నేతలంతా బీజేపీలోకి వెళ్లి పోతున్నారు. ఈ క్రమంలోనే నలుగురు రాజ్యసభ సభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు కూడా కాషాయం గూటికి చేరిపోయారు.  సార్వత్రిక ఎన్నికలు అయిపోయాయి... ఇక వరుస పెట్టి స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు.. మరి ఇలాంటి టైమ్ లో ఉప ఎన్నికలు ఏంటి ? అన్న సందేహం సహజంగానే వస్తుంది.టిడిపి నుంచి గెలిచిన ప్రజాప్రతినిధుల్లో చాలామంది బిజెపి వైసీపీలోకి జంప్ చేసేందుకు కాచుకొని కూర్చుని ఉన్నారు. బీజేపీలోకి వెళ్లేందుకు పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు. పార్టీకి రాజీనామా చేస్తే సరిపోతుంది.. ఎంపీ లేదా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉండదు. అదే వైసీపీలోకి వెళ్లాలంటే మాత్రం టీడీపీతో పాటు ఆ పార్టీ నుంచి వచ్చిన పదవికి సైతం రాజీనామా చేయాల్సిందే అన్న కండిషన్ జగన్ ఇప్పటికే పెట్టేశారు.

టిడిపి నుంచి ఎవరు వైసీపీలోకి వస్తామన్న తీసుకునే పరిస్థితి కూడా లేదు. కాస్త క్యారెక్టర్ ఉన్నవాళ్లు... కేడర్ ఉన్నవాళ్లను మాత్రమే పార్టీలోకి తీసుకుందామని జగన్ ఇప్పటికే పార్టీ నేతలకు సూచించారు. ఎనిమిది మంది టిడిపి ఎమ్మెల్యేలు ఇప్పటికే తమతో టచ్లో ఉన్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిలో ఇద్దరు నేతలు పార్టీలో చేరేందుకు జగన్ కూడా సుముఖంగా ఉన్నారని కూడా గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన బాంబు పేల్చారు.

ఇదిలా ఉంటే ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి టీడీపీకి దూరం దూరంగా ఉంటోన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వాలిపోయేందుకు ప్రయత్నాలు మెదలెట్టేశారట. ఆయనతో పాటు ఆయన అనుచరులుగా ఉన్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తమ పదవులకు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలు ఎదుర్కొనేందుకు అయినా రెడీగానే ఉన్నట్టు తెలుస్తోంది. గంటా బలమైన నేతే... ఆయన పార్టీలోకి వస్తే జగన్ డెసిషన్ ఎలా ?  ఉంటుంది.. అన్నది మాత్రం చూడాలి.

ఉత్తరాంధ్రలో గంటా లాంటి బలమైన నేత అవసరం ఉందనుకుని జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే గంటాతో పాటు ఆయన ఇద్దరు అనుచరులు అయిన ఎమ్మెల్యేలు కూడా పదవులు వదులుకుంటే ఉప ఎన్నికలు తప్పవ్. త్వరలోనే గ్రేటర్ విశాఖ ఎన్నికలు ఉండనే ఉన్నాయ్. ఇక విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కూడా తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఎక్కువ మెజార్టీ వచ్చేదని వ్యాఖ్యానించారు. అవసరమైతే తన పదవికి కూడా రాజీనామా చేస్తానని నేరుగా బాబుకే సవాల్ విసిరారు. నాని బీజేపీలోకి వెళితే టైంను బట్టి ఎంపీ పదవికి రాజీనామా చేసే ఛాన్స్ కూడా ఉంది. అదే జరిగితే విజయవాడ ఎంపీ సీటుకు కూడా ఉప ఎన్నిక తధ్యం. ఏపీలో ఉప ఎన్నికలు వస్తే వైసీపీ- టీడీపీ- జనసేన- బీజేపీ మధ్య సంగ్రామం మామూలుగా ఉండదు.