Begin typing your search above and press return to search.

చిన్నారికి బంపర్ లాటరీ.. ఉచితంగా రూ.16 కోట్ల ఇంజెక్షన్

By:  Tupaki Desk   |   3 Aug 2021 11:38 AM GMT
చిన్నారికి  బంపర్ లాటరీ.. ఉచితంగా రూ.16 కోట్ల ఇంజెక్షన్
X
జీవితంలో ఏ సమయంలో ఏ విధంగా అదృష్టలక్ష్మీ తలుపుతడుతుందో చెప్పడం అనేది చాలా కష్టం. కానీ, ఓ చిన్నారికి చిన్న వయసులోనే బంపర్ లాటరీ తగిలింది. నాసిక్‌ లోని శివరాజ్ దావరే అనే చిన్నారి అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. కాగా ఆస్పత్రిలో చూపిస్తే చిన్నారికి అరుదైన జన్యు పరమైన వ్యాధి సోకిందని చికిత్సకు కోట్లలో ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. కానీ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఆ చిన్నారి తల్లి దండ్రులకు డాక్టర్ల మాటలు వినే సరికి ఒక్కసారిగా గుండెలు జారిపోయాయి.

ఎలాగైనా సరే తమ చిన్నారిని బతికించుకోవాలనే పట్టుదల మాత్రం వారిలో కొండంత ఉంది. కానీ చికిత్సకు అవసరమైన డబ్బులు మాత్రం చేతిలో లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోక విధినే నమ్ముకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అనుకోని అదృష్టం వారి తలుపుతట్టింది. చిన్నారికి ఉన్న వ్యాధి చికిత్సకు అవసరమైన దాదాపు 16 కోట్ల విలువ చేసే ఇంజెక్షన్ లాటరీలో ఉచితంగా లభించడం విశేషం. ఇలా అనుకోకుండా వచ్చిన లాటరీతో చిన్నారి తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా ఓ డాక్టర్ అమెరికాకు చెందిన ఓ సంస్థ చికిత్సకు అవసరమైన మందును ఉచితంగా లాటరీ ద్వారా అందజేస్తుందని అప్లై చేసుకోవాలని తెలిపాడు.

అలా దరఖాస్తు చేసుకున్న ఆ తండ్రికి కొన్ని రోజుల్లోనే నమ్మశక్యం కాని రీతిలో ఇంజెక్షన్ లాటరీలో వచ్చింది. దాదాపు 16 కోట్ల విలువ చేసే ఇంజెక్షన్ ఉచితంగా లభించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అదృష్టవశాత్తూ డిసెంబర్ 25, 2020 న శివరాజ్ ఇంజెక్షన్ పొందడానికి లక్కీ డ్రాలో ఎంపికయ్యాడు. ఫలితంగా ఈ ఏడాది జనవరి 19 న, శివరాజ్‌కు హిందూజా ఆసుపత్రిలో ఇంజక్షన్‌ ఇచ్చారు. వైద్యుల ప్రకారం ఎస్‌ఎంఏ అనేది జన్యుపరమైన వ్యాధి. ప్రతి 10వేల మందిలో ఒకరు ఈ వ్యాధితో పడుతున్నారు. ఈ జన్యు లోపం పిల్లల కదలికలను నిరోధిస్తుంది. కండరాలు పని తీరును, మెదడు కణాలను ప్రభావితం చేస్తుంది. ఇది క్రమంగా పిల్లల మరణానికి దారితీస్తుంది. ప్రస్తుతం దీనికి అందుబాటులో ఉన్న చికిత్స ప్రపంచంలోనే అతి ఖరీదైన జోల్జెన్‌స్మా ఇంజెక్షన్‌ మాత్రమే.