ఏపీ అసెంబ్లీలో 'జబర్దస్తీ' డైలాగ్స్!

Thu Jul 18 2019 21:31:25 GMT+0530 (IST)

ఏపీ అసెంబ్లీలో సినిమా డైలాగులు పేలుతూ ఉన్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల వాళ్లు తమ తమ ప్రసంగాల్లో సినిమా డైలాగులను వాడేస్తూ ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ఈ డైలాగులు అదనపు ఆకర్షణగా మారాయి.ఏపీ అసెంబ్లీ  బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యేకించి అధికార పార్టీలోని కొంతమంది నేతలు అటు శాసనసభలోనూ ఇటు మండలిలోనూ తమ కామెంట్లతో కాకపుట్టిస్తున్నారు.

ఎన్నికలు ఇటీవలే ముగిసిన నేపథ్యంలో వివిధ అంశాల్లో చంద్రబాబు నాయుడి గత ఐదేళ్ల పాలన గురించినే చర్చ జరుగుతూ ఉంది. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ను తెలుగుదేశం వాళ్లు విమర్శిస్తూ ఉండగా.. ఆ విమర్శలను తిప్పి కొట్టడానికి చంద్రబాబు నాయుడి గత ఐదేళ్ల పాలనను గుర్తు చేస్తూ ఉన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.

ఈ సందర్భంగా వారు  సినిమా డైలాగులను కూడా తరచూ ప్రయోగిస్తూ ఉన్నారు. వివిధ సినిమాల్లో పాపులర్ అయిన డైలాగులను వాడుతూ చంద్రబాబు మీద విరుచుకుపడుతూ ఉన్నారు. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సినిమా డైలాగులను రాజకీయ నాయకుల నోటి వెంట వినడానికి మించి సోషల్ నెటిజన్లకు వినోదం ఉండదు. అందుకే వారు ఆ వీడియో బైట్స్ ను వైరల్ చేస్తూ ఉన్నారు.

తాజాగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో ఒక సినిమా డైలాగ్ ను వాడేశారు. 'విషయం వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్ లో ఉంటుంది..' అంటూ బుగ్గన అధికార పార్టీ సభ్యులను నవ్వించారు. చంద్రబాబు నాయుడి పాలనను ఉద్దేశించి బుగ్గన ఈ డైలాగ్ వేశారు. చంద్రబాబు నాయుడు హయాంలో వివిధ వ్యవహారాల్లో ప్రచారమే తప్ప అసలు పని ఏమీ లేదని బుగ్గన ధ్వజమెత్తారు. ఆ సందర్భంగా ఈ సినిమా డైలాగ్ వేశారు. ఇది కాస్తా వెబ్ లో వైరల్ గా మారుతూ ఉంది. మొత్తానికి సినిమా వాళ్ల డైలాగులతో సభలో చర్చ ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతున్నట్టుంది! అలాగే జబర్దస్త్ తో సోషల్ మీడియాలో పాపులర్ అయిన డైలాగులను కూడా అసెంబ్లీలో నేతలు వాడేస్తూ ఉండటం గమనార్హం.