అమరావతి ఎందుకు వద్దో చెప్పిన బుగ్గన

Mon Jan 20 2020 11:36:58 GMT+0530 (IST)

Buggana Rajendranath Reddy On Amaravathi

1.09 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి అమరావతి కడుదామా? లేక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామా అని ఆర్థిక మంత్రి బుగ్గన ప్రతిపక్ష టీడీపీని ప్రశ్నించారు.  ఏపీకి 3 రాజధానుల బిల్లును ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆవేశంగా ఆవేదనగా ఏపీ పరిస్థితిని కళ్లకు కట్టారు.. రాయలసీమ కరువుతో అల్లాడుతుంటే.. ఉపాధి లేక ఉత్తరాంధ్ర ప్రజలు వలస వెళ్తుంటే.. శ్రీకాకుళం జాలర్లు పాకిస్తాన్ సైనికులకు చిక్కితే.. ఇన్ని సమస్యలు పరిష్కరించకుండా.. అప్పు తెచ్చి అమరావతి కడుదామా.. సమస్యలు తీర్చుకుందామా అని బుగ్గన ప్రశ్నించారు. చంద్రబాబు అమరావతి గ్రాఫిక్స్ చూసి ప్రపంచ బ్యాంక్ కూడా వెనక్కి తగ్గిందని బుగ్గన విమర్శించారు.

అమరావతి పేరిట చంద్రబాబు భూపందేరం చేశారని మంత్రి బుగ్గన విమర్శించారు. ప్రైవేట్ సంస్థలకు 1300 ఎకరాలు ఎకరానికి కోటి చొప్పున కేంద్ర సంస్థలకు  బ్యాంకులకు 4 కోట్ల చొప్పున ఎకరం రూ.50 లక్షలకు ఎకరం చొప్పున 200 ఎకరాలు ప్రైవేట్ విద్యాసంస్థలైన విట్ ఎస్ఆర్ఎం అమృత వర్సిటీకి ఇచ్చిందని బుగ్గన ధ్వజమెత్తారు. వివిధ ఆస్పత్రులకు 150 ఎకరాల చొప్పున దోచిపెట్టాడని మండిపడ్డారు.

చంద్రబాబు అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడని.. వైసీపీ ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఆలోచన లేదని.. అందుకే రాజధానిని విశాఖకు మారుస్తున్నామని స్పష్టం చేశారు. నాడు ఎన్టీఆర్ మండలాలు తెచ్చి చరిత్రలో నిలిచారని.. సీఎం జగన్ 3 రాజధానులతో చరిత్రలో నిలుస్తారన్నారు. విశాఖలో మావోయిస్టులున్నారని చంద్రబాబు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చి చంద్రబాబు అమరావతి పేరుతో దోచుకున్నారని బుగ్గన విమర్శించారు.