బుగ్గన సంచలనం..రాజధానిలో బాబు బండారం బయటకొచ్చేసినట్టేనా?

Thu Dec 05 2019 22:25:55 GMT+0530 (IST)

Buggana Rajendranath Reddy Counter To Chandrababu Naidu

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి సంబంధించి నిన్నటిదాకా మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేస్తే... తాజాగా జగన్ కేబినెట్ లో మరో కీలక మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి పేరిట గత టీడీపీ హయాంలో నాటి సీఎం నారా చంద్రబాబునాయుడు అక్రమాలకు పాల్పడ్డారని తనదైన శైలి వ్యాఖ్యలు చేసిన బుగ్గన... ఆ అక్రమాలన్నింటినీ త్వరలోనే బయటపెట్టేస్తామని కలకలం రేపారు. అంతేకాకుండా అమరావతిలో బాబు ఫ్యామిలీకి కూడా భూములు ఉన్నాయని ఆ భూములను తన హెరిటేజ్ కంపెనీ పేరిట బాబు కొనుగోలు చేశారని కూడా బుగ్గన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగని బుగ్గన... రాజధాని కోసం సేకరించిన భూముల్లో ఎన్నెన్ని అక్రమాలు జరిగాయన్న విషయంపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.రాజధానిని అమరావతిగా ప్రకటించేదాని కంటే ముందుగానే చంద్రబాబుతో పాటు ఆయన అనుచరులు కూడా భూములు కొనేసుకుని ఆ తర్వాతే రాజధానిని ప్రకటించారని కూడా బుగ్గన సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు వారి అనుకూలురకు చెందిన భూములను ఓ రకమైన ప్యాకేజీ కింద తీసుకున్న చంద్రబాబు సర్కారు... దళితుల చేతుల్లోని అసైన్డ్ భూములను మాత్రం బలవంతంగా లాగేసుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా తమ వర్గానికి చెందిన భూముల్లోనే రాజధానికి చెందిన జోన్లను డిజైన్ చేసుకున్నారని కూడా బుగ్గన బాంబు లాంటి వార్త పేల్చారు. ఈ తరహా అక్రమాలపై విచారణ జరుగుతోంది.. త్వరలోనే వాస్తవాలు బయటకు రాబోతున్నాయని పెను కలకలమే రేపారు.

ఇక రాజధాని ప్రాంతంలో హెరిటేజ్ పేరుతో చంద్రబాబు డైరెక్ట్గా కొంటే... పరిటాల సునీత పయ్యావుల ధూళిపాళ్ల జీవీ ఆంజనేయులు యనమల వియ్యంకుడు కొమ్మాలపాటి శ్రీధర్ - కంభంపాటి రామ్మోహన్ వంటి వారికి వారి పేర్లతోనే భూములున్నాయని.. బినామీల పేరుతో ప్రత్తిపాటి పుల్లారావు - వేమూరి రవి వంటి వారు భూములు కొన్నారని ఆరోపించారు. డ్రైవర్లు-  అకౌంటెంట్లు - ఇతరుల పేర్లతో కూడా భూములు కొనేసినట్టు బుగ్గన ఆరోపించారు. దళితుల పొట్టకొట్టిన చంద్రబాబు రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని మండిపడ్డ బుగ్గన.. లంక భూములు అసైన్డ్ భూములను కొన్నవారిలో మెజార్టీగా టీడీపీ వాళ్లే ఉన్నారని ఆరోపించారు. రాజధానిలో చంద్రబాబు చేసిన మోసాలతో శఠగోపం పేరుతో బ్రహ్మండమైన సినిమా తీయొచ్చు అని బుగ్గన ఎద్దేవా చేశారు. మొత్తంగా రాజధానిపై తనదైన శైలి వ్యాఖ్యలు చేసిన బుగ్గన అగ్గి రాజేశారనే చెప్పాలి.