Begin typing your search above and press return to search.

నాటి వైసీపీ బాధ...ఇప్పుడు టీడీపీకి తెలిసొచ్చిందబ్బా!

By:  Tupaki Desk   |   24 Jan 2020 2:30 PM GMT
నాటి వైసీపీ బాధ...ఇప్పుడు టీడీపీకి తెలిసొచ్చిందబ్బా!
X
నిజమే... నాడు విపక్ష హోదాలో ఉన్న వైసీపీ అనుభవించిన బాధ ఎలాంటిదో.. నాడు అధికార పక్షంగా ఉండి ఇప్పుడు విపక్ష హోదాలోకి మారిపోయిన తెలుగు దేశం పార్టీకి తెలిసొచ్చిందనే చెప్పాలి. నాడు తమ పార్టీ టికెట్లపై విజయం సాధించిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్సీలను టీడీపీ లాగేస్తే... ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందంటూ వైసీపీ నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే ప్రయోగించిన ‘సంతలో పశువులు’ మాట ఇప్పుడు విపక్ష హోదాలోకి మారిపోయిన టీడీపీకి ఊతపదంలా మారిపోయింది. టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు కీలక సమయంలో ఆ పార్టీకి దూరంగా జరిగిన నేపథ్యంలో... నాడు జగన్ ప్రయోగించిన ఆ పదాన్ని ఇప్పుడు టీడీపీ ప్రయోగించడం మొదలుపెట్టింది. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలు ఆ పార్టీకి దేరమై... వైసీపీకి దగ్గరవుతుంటే... సంతలో పశువుల మాదిరిగా తమ ప్రజా ప్రతినిధులను వైసీపీ లాగేస్తోందంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై బుద్ధా నోట నుంచి వచ్చిన ఈ మాట ఇకపై టీడీపీకి ఊతపదంలా మారే అవకాశాలు లేకపోలేదన్న మాట గట్టిగానే వినిపిస్తోంది.

నాడు విపక్ష నేత హోదాలో ఉండి మొన్నటి ఎన్నికల్లో బంపర్ విక్టరీని అందుకున్న జగన్ రాష్ట్రంలో సంచలనాలకే సంచలనాలుగా నిలుస్తున్న సంక్షేమ పథకాలను ప్రారంభిస్తూ దూకుడుగా సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీమోహన్ (గన్నవరం), మద్దాలి గిరిధర రావు (గుంటూరు తూర్పు)లు ఆ పార్టీకి రాజీనామాలు చేసి జగన్ కు జైకొట్టేశారు. వారిద్దరూ ఇంకా వైసీపీ జెండా కప్పుకోకున్నా... జగన్ కు దగ్గరగానే సాగుతున్నారు. ఇదే తరుణంలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల నేపథ్యంలో టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్, పోతుల సునీతలు టీడీపీకి దూరంగా జరిగారు. వీరిలో డొక్కా ఇంకా వైసీపీలో చేరకపోగా.. పోతుల మాత్రం గురువారం తన భర్త పోతుల సురేష్ తో కలిసి జగన్ తో భేటీ అయ్యారు. అంతేకాకుండా తాము వైసీపీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. ఈ క్రమంలో రాజ్యాంగబద్ధంగా తమ పదవులకు ఏమైనా ఇబ్బంది కలిగితే ఆ పదవులను తృణప్రాయంగా వదిలేస్తామని కూడా చెప్పేశారు.

ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు శుక్రవారం మీడియా ముందుకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్సీ బద్ధా వెంకన్న... అధికార వైసీపీ తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులను నిబంధనలకు విరుద్ధంగా లాగేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా నాడు జగన్ నోట వినిపించిన ‘సంతలో పశువులు’ మాటను కూడా ఆయన ప్రయోగించారు. తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులను వైసీపీ సంతలో పశువుల మాదిరిగా లాగేస్తోందని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సందర్భంగా జగన్ ను కాకుండా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసిన బుద్ధా... రెండు రోజుల పాటు శాసనమండలిలోనే ఉండి, చేసిన చెత్తపనులు సరిపోనట్టు శ్రీరంగనీతులు చెబుతావా విజయసాయిరెడ్డీ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్వార్థం కోసం రాజధానిని విభజించాలని చూస్తున్నారని, తోడుదొంగలను రంగంలోకి దింపి ఎమ్మెల్సీలను కొనాలని చూశారని విమర్శించారు. చివరికి సంతలో పశువుల్లా ఇద్దరు ఎమ్మెల్సీలను కొన్నారని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. మొత్తంగా తన దాకా వస్తే గానీ ఆ నొప్పి ఏమిటన్న విషయం తెలిసిరాదన్న చందంగా బుద్ధా వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.