Begin typing your search above and press return to search.

మంట గలిసిన రక్త సంబంధం.. సాగునీటి వాటా కోసం వేటకొడవళ్లతో తలపడ్డ అన్నదమ్ములు

By:  Tupaki Desk   |   25 Oct 2020 10:50 AM GMT
మంట గలిసిన రక్త సంబంధం.. సాగునీటి వాటా కోసం వేటకొడవళ్లతో తలపడ్డ అన్నదమ్ములు
X
పుట్టగానే అన్నదమ్ములు పెరుగుతూ దాయాదులు.. అని పెద్దలు ఊరికే అనలేదు. ఎంతో అన్యోన్యంగా కలసిమెలసి పెరిగిన ఎంతో మంది అన్నదమ్ములు ఆస్తుల పంపకం, భూముల పంపకాల విషయమై గొడవ పడటం వింటూనే ఉంటాం. ఇది ఇప్పుడు మొదలైంది కాదు. అనాది కాలంగా చూస్తున్నదే. ఒక తల్లి గర్భంలో పుట్టి ఒకే రక్తం ప్రవహిస్తున్న అన్నదమ్ములు పొరుకు దిగడం అంటే అంతగా మించిన దారుణం మరొకటి ఉండదు. చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలో వ్యవసాయ పొలం లో నీటి వాటా విషయమై అన్నదమ్ముల మధ్య గొడవలు చెలరేగి ఇరువర్గాలు ఒకరిపై మరొకరు వేటకొడవళ్లతో దాడి చేసుకునే వరకు పోయింది. ఒకరిపై మరొకరు కత్తులతో దాడి చేసుకోవడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలై ఆసుపత్రి పాలయ్యారు.

మదనపల్లె మండలంలోని అబ్బగొందినాయునివారి పల్లెలో అన్నదమ్ములైన చిన్నప్ప, అమర్నాథ్ లకు పొలంలోని బోరులో నీటి వాటా విషయమై కొద్దిరోజులుగా గొడవ జరుగుతోంది. ఆదివారం పొలం వద్ద మరోసారి ఇద్దరి మధ్య నీటి వాటా విషయమై ఘర్షణ జరిగింది. దీంతో ఇరువర్గాలు ఒకరిపై మరొకరు వేటకొడవళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో అన్నదమ్ములిద్దరికీ కత్తిపోటు గాయాలయ్యాయి. స్థానికులు వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై మదనపల్లె రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. వేటకొడవళ్లతో దాడికి పాల్పడ్డ రమణ, శ్రీనివాసులును పోలీసులు అరెస్టు చేసి కేసు దర్యాప్తు ప్రారంభించారు.