Begin typing your search above and press return to search.

ఏపీలో ఎన్నిక‌ల‌కు ముహూర్తం పెట్టేశారు...

By:  Tupaki Desk   |   12 Sep 2019 10:59 AM GMT
ఏపీలో ఎన్నిక‌ల‌కు ముహూర్తం పెట్టేశారు...
X
గ‌త యేడాది కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఎన్నిక‌ల‌తో క్ష‌ణం తీరిక లేనంత బిజీ అయ్యారు. ఇప్పుడిప్పుడే ఎన్నిక‌ల మూడ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. అలా వ‌చ్చారో లేదో ఏపీలో మ‌ళ్లీ ఎన్నిక‌ల జాత‌ర‌కు రంగం సిద్ధ‌మైంది. ఏపీలో వ‌రుస‌గా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఏపీలో డిసెంబ‌ర్ లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న‌ట్టు క్లారిటీ వ‌చ్చేసింది. ఏపీలో అన్ని స్థానిక సంస్థ‌ల స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ మున్సిపల్ ఎన్నికలు డిసెంబరులో జరుగుతాయని ఆ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. డిసెంబరులో అన్ని మున్సిపాలిటీలకు - కార్పొరేషన్లకు ఎన్నికలు జరిపాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఏపీలో స్థానిక సంస్థ‌లు అయిన పంచాయ‌తీలు - మున్సిపాల్టీలు - కార్పొరేష‌న్లు - మండ‌ల ప‌రిష‌త్‌ లు - జిల్లా ప‌రిష‌త్‌ ల‌కు త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది.

ముందుగా మండ‌ల - జిల్లా ప‌రిష‌త్‌ లు లేదా మున్సిపాల్టీల ఎన్నిక‌ల నుంచి ఈ ఎన్నిక‌ల కోలాహలం ప్రారంభం కానుంది. ఈ విష‌యంపై బొత్స మాట్లాడుతూ కొన్ని కార్పొరేషన్లు - మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిపేందుకు ఉన్న న్యాయపరమైన ఇబ్బందులు కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కొత్త కార్పొరేషన్లు - మున్సిపాలిటీల్లో నిబంధలనల ప్రకారమే ఎన్నికలు జరుపుతామని బొత్స సత్యనారాయణ తెలిపారు.