బొత్స నోరు తగ్గించుకోవాలని వైసీపీలో సూచనలు?

Wed Sep 18 2019 22:43:34 GMT+0530 (IST)

మాటలతో మంటలు రాజేస్తున్నారు బొత్స సత్తిబాబు. గతంలో జగన్ మీద తీవ్రంగా నోరేసుకున్న వారిలో బొత్స ముఖ్యులు. కాంగ్రెస్ పార్టీ చేతిలో అధికారం ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ అతి తీవ్రంగా - అవసరానికి మించి స్పందించేవారు. చివరకు అదే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా నెగ్గుకురాలేకపోయారు. చివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి పదవిని కూడా పొందేశారు.ఈ క్రమంలో బొత్స మంత్రిగా తరచూ స్పందించేస్తూ ఉన్నారు. ఆయన మున్సిపల్ శాఖా మంత్రి. తన శాఖకు సంబంధించిన వ్యవహారాల సంగతెలా ఉన్నా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా బొత్స రియాక్ట్  అవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయన తీరు కొన్ని వివాదాలను కూడా తెచ్చిపెడుతూ ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనూ ఇప్పుడు అలాంటి అభిప్రాయాలే వినిపిస్తూ ఉన్నాయట. వివిధ అంశాల గురించి బొత్స మాట్లాడే మాటలు వివాదాలను రాజేస్తూ ఉన్న నేపథ్యంలో ఆయన నోరు తగ్గించుకుంటే మంచిదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది ముఖ్యనేతలు సూచిస్తున్నట్టుగా తెలుస్తోంది.

రాజధాని మార్పు ఊహాగానాలకు కారణమైంది బొత్స చేసిన కామెంట్లే. ఆ అంశం గురించి ఇప్పటి వరకూ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడనే లేదు. అయితే బొత్స రాజేసిన నిప్పుతో ప్రతిపక్షాలు తెగ రెస్పాండ్ అయ్యాయి. మాట్లాడటానికి ఏమీ దొరక్క అల్లాడుతున్న తెలుగుదేశం పార్టీ పవన్ కల్యాణ్ లకు బొత్స అలా ఒక అవకాశం ఇచ్చారు.

అయితే బొత్స వ్యాఖ్యలను వైసీపీలోని నేతలెవరూ సమర్థించలేదు. ముఖ్యమంత్రి ఆ అంశం గురించి కామ్ గా ఉండటంతో అందరూ కామ్ గా ఉన్నారు. బొత్స మాత్రం ఆ అంశం గురించి మీడియా కనిపించినప్పడల్లా ఏదో ఒక మాట్లాడుతూ ఉన్నారు. ఇక అదే గాక.. ఇతర అంశాల గురించి కూడా బొత్స తరచూ మీడియాలో కనిపించడానికి కామెంట్లు చేయడానికి ప్రాధాన్యతను ఇస్తున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన  ఇంకా కాంగ్రెస్ నేతలాగానే వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.