Begin typing your search above and press return to search.

బొత్సకు బేజారు, టీడీపీలో హుషారు

By:  Tupaki Desk   |   16 May 2022 5:37 AM GMT
బొత్సకు బేజారు, టీడీపీలో హుషారు
X
విజ‌య‌న‌గ‌రం జిల్లా, చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం, గరివిడి మండలం, కుమరాం గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ ముళ్ళు రమాదేవి, ముళ్ళు రమణ దంపతులతో స‌హా 2000 మంది టీడీపీలో చేరారు. బొత్స సొంత ఇలాకాలో ఏవో మార్పులు జ‌రుగుతున్నాయి. వీటికి అనుగుణంగానే చేరిక‌లు ఉంటున్నాయి. గ‌తం క‌న్నా బొత్స మాట అక్క‌డ పెద్ద‌గా నెగ్గే విధంగా లేదు. పార్టీలో కూడా ఆయ‌న ప్రాభవం త‌గ్గింది అని కూడా కొంద‌రు అంటున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌లు ఎలా లేద‌న్నా ఆయ‌నకొక జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్యే కానున్నాయి. విజ‌య‌న‌గ‌రంతో పాటు నెల్లిమ‌ర్ల, చీపురుప‌ల్లి, గ‌జ‌ప‌తి న‌గ‌రం నియోజ‌వ‌క‌ర్గాల‌ను శాసించే శ‌క్తి ఉంది. అదేవిధంగా శృంగ‌వ‌ర‌పుకోట‌లో కూడా పాగా వేయ‌గ‌లిగే శ‌క్తి ఉంది. కానీ ఇదంతా ఒక‌ప్పుడు. ఇప్పుడు పార్టీలో రెండు వ‌ర్గాలు అయిపోయాయి. ఒక వ‌ర్గాన్ని అల్లుడు చిన్న శ్రీ‌ను న‌డిపిస్తున్నారు. ఆయ‌నే ద‌గ్గ‌రుండి మామ‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్నారు అన్న వాద‌న కూడా ఉంది.

గ‌తంలో క‌న్నా బొత్స మాట చెల్ల‌క‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం వ‌ర్గ పోరే కాదు ఇంకా కొన్ని ఉన్నాయి. ఆయ‌న మంత్రిగా బాధ్య‌త‌లు అందుకున్నాక జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించ‌లేదు. అమ‌రావ‌తి కేంద్రంగానే ఉండిపోయారు. పెద్ద‌గా ఎక్క‌డా మాట్లాడినా కూడా అవ‌న్నీ రాష్ట్ర రాజ‌కీయాల‌పైనే కానీ జిల్లాకు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను ఆయ‌న అడ్ర‌స్ చేసిన దాఖ‌లాలు లేవు.

తోట‌ప‌ల్లి కాలువ ఆధునికీక‌ర‌ణ ఆయ‌న చేతిలోనే ఉంది. మ‌రి! వాటిపై దృష్టి పెట్టారా అంటే లేదు. ఉమ్మ‌డి శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం అనే ఈ రెండు జిల్లాల‌కూ చెందిన తోట‌ప‌ల్లి కానీ నారాయణ పురం ప్రాజెక్టుల నిర్వ‌హ‌ణ‌పై పెద్ద‌గా దృష్టి సారించిన వైనం లేదు. అంతేకాదు జిల్లాల విభ‌జ‌న అయినా కూడా ఎక్క‌డా క్షేత్ర స్థాయి ప‌ర్య‌ట‌న‌లు లేవు. రివ్యూ మీటింగులు లేవు. ఆక‌స్మిక త‌నిఖీలు లేవు. ఆయ‌న ఒక్క విజ‌య‌న‌గ‌రానికే కాదు శ్రీ‌కాకుళం జిల్లాకూ నాయ‌కుడే! ఈ ప్రాంత‌పు రీజ‌న‌ల్ కో ఆర్డినేట‌ర్ ఆయ‌నే! శ్రీ‌కాకుళం జిల్లా ఇంఛార్జి మంత్రి కూడా ఆయనే!

ఒక‌ప్పుడు త‌న‌కు చెందిన కాపు సామాజిక‌వ‌ర్గం లో ఆయ‌న మాట చెల్లేది. కానీ ఇప్పుడు కాపు నాయ‌కులు కొంద‌రు టీడీపీతో ఉంటున్నారు. వారితో స్నేహం చేస్తున్నారు. వాటిని వ‌ద్ద‌ని చెప్ప‌లేక‌పోతున్నారు. ఐక్య‌త అన్న‌ది సొంత సామాజిక వ‌ర్గంలోనే లేన‌ప్పుడు ఇక మిగ‌తా కులాల‌ను ఆయ‌న ఏ విధంగా క‌లుపుకుని వెళ్ల‌గ‌ల‌రు అన్న సందేహాలూ ఉన్నాయి.

కొంద‌రు తూర్పు కాపు సంక్షేమ సంఘాల పేరిట రాష్ట్ర స్థాయిలో బొత్స‌కు వ్య‌తిరేకంగా లాబీయింగ్ న‌డుపుతున్నారు. ప‌దవుల వ‌ర‌కూ బొత్స త‌న‌వాళ్ల‌కే ప్రాధాన్యం ఇచ్చి అనుకున్న‌ది సాధించినా ఇప్పుడా ఫలితాలు మాత్రం ఏమంత అనుకున్నంత సానుకూలంగా లేవు. ఇవ‌న్నీ బొత్స‌కు అన‌నుకూల విష‌యాలే !