Begin typing your search above and press return to search.

సిట్ పై టీడీపీ ఎటాక్..టీడీపీపై బొత్స ఫైరింగ్

By:  Tupaki Desk   |   22 Feb 2020 3:33 PM GMT
సిట్ పై టీడీపీ ఎటాక్..టీడీపీపై బొత్స ఫైరింగ్
X
టీడీపీ హయాంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు కోసమంటూ జగన్ సర్కారు తాజాగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)పై మాటల మంటలు రేగుతున్నాయి. సిట్ ఏర్పాటు కక్షసాధింపేనంటూ విపక్ష టీడీపీ నేతలు చేస్తున్న కామెంట్లపై అధికార వైసీపి కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండానే కౌంటర్లు ఇచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ కేబినెట్ లో కీలక మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చేశారు. అసలు సిట్ వేయమన్నదే టీడీపీ అంటూ బొత్స చేసిన కామెంట్లు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. బొత్స వినిపించిన సరికొత్త వాదనతో టీడీపీ నిజంగానే అడ్డంగా బుక్కైందని చెప్పక తప్పదు.

అయినా బొత్స ఏమన్నరన్న విషయానికి వస్తే... అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరిపించమని టీడీపీనే స్వయంగా కోరిందని బొత్స బాంబు పేల్చారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనే విషయానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పిన బొత్స... విపక్షం అడిగినందుననే సిట్ ను ఏర్పాటు చేశామని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా ఎంక్వైరీ చేయమని అడిగిన టీడీపీ... ఇప్పుడు విచారణకు తాము సిద్ధపడి సిట్ వేసిన తర్వాత గగ్గోలు పెట్టడమేటని కూడా బొత్స ఎద్దేవా చేశారు. అయినా అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని చెబుతున్న టీడీపీ... దానిపై విచారణ అంటే ఎందుకు ఉలిక్కిపడుతుందని, అయినా తప్పు చేయకుంటే టీడీపీ నేతలు నిర్దోషులుగా బయటపడతారు కదా అని కూడా బొత్స వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా ఇన్ సైడర్ ట్రేడింగ్ పై టీడీపీ వినిపిస్తున్న వాదనలను వరుసగా ప్రస్తావించిన బొత్స... టీడీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న విషయంపై టీడీపీ పూటకో మాట మాట్లాడుతోందని బొత్స విరుచుకుడ్డారు. తొలుత సీబీఐకి ఈ విచారణ బాధ్యతలు అప్పగిస్తామంటే... రాష్ట్ర పోలీసులను అవమానిస్తారా? అంటూ టీడీపీ వ్యాఖ్యానించిందని చెప్పారు. సీఐడీకి అప్పగిస్తామంటే.. రాష్ట్ర పోలీసులు ప్రభుత్వం చెప్పినట్లు వింటారని మళ్లీ మాట మార్చారని తెలిపారు. టీడీపీ వాదనలను విన్న తర్వాతే తాము సిట్ ను ఏర్పాటు చేశామని బొత్స చెప్పుకొచ్చారు. మొత్తంగా అమరావతిలో జరిగిందని తాము చెబుతున్న ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణను ఎప్పటికప్పుడు అడ్డుకునేందుకే టీడీపీ యత్నించిందని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక తాజాగా బయటపడిన ఈఎస్ ఐ కుంభకోణాన్ని ప్రస్తావించిన బొత్స... తప్పు ఎవరు చేశారన్న విషయాన్నే చూడాలి తప్పించి.. ఆ తప్పు చేసిన వారు బీసీలా - ఎస్సీలా - ఎస్టీలా - ఓసీలా అని చూడటం కుదరదన్నారు. దీనిపై అధికారంలో ఉన్న తామైనా - ఇంకెవరైనా కూడా ఇదే రీతిన వ్యవహరిస్తారు తప్పించి... తప్పు చేసిన వారు బలహీన వర్గాలకు చెందిన వారని ఎవరినీ వదిలేయరని కూడా బొత్స తనదైన శైలి పంచ్ డైలాగులు సంధించారు. అయినా ఈ కుంభకోణంలోకి ప్రధాని మోదీని ఎలా లాగుతారని కూడా బొత్స ప్రశ్నించారు. ఫలానా కంపెనీకి కబ్టబెట్టమని మోదీ స్వయంగా ఏమైనా చెప్పారా? అని కూడా బొత్స ప్రశ్నించారు. తెలంగాణ అమలు చేసిన విధానాన్ని అనుసరించాలని లేఖ రాసిన అచ్చెన్నాయుడు.. మరి ఏపీలో మాత్రమే రూ.400 కోట్ల మేర నష్టం వస్తే ఎందుకు మాట్లాడలేదని బొత్స ప్రశ్నించారు. మొత్తంగా ఈఎస్ ఐ స్కాంలో దోషులకు శిక్ష తప్పదని కూడా బొత్స స్పష్టం చేశారు.