సీబీఐ కోర్టు నోటీసుల అసలు గుట్టు విప్పిన బొత్స

Sat Aug 24 2019 12:59:34 GMT+0530 (IST)

Botsa Satyanarayana Gives Clarity on About CBI Notices

ఏదైనా విషయాన్ని రిపోర్ట్ చేసే సమయంలో కొన్ని అంశాల్ని పక్కాగా ఫాలో అయ్యే తరం పోయి తెలుగు మీడియాలో చాలాకాలమే అయిపోయింది. ఉరుకులు పరుగులు పెట్టించే మేనేజ్ మెంట్లు.. పాత్రికేయం జర్నలిస్టులకు ఉద్యోగంగా మారిపోతే.. మీడియాకు లాభాలు సంపాదించి పెట్టే వ్యాపారమైంది. దీంతో.. ఎవరికి వారు తూతూ మంత్రంగా వ్యవహరించటం తప్పించి లోతుల్లోకి వెళుతున్న వారు తక్కువ. దీనికి తోడు.. విషయం ఏదైనా చిన్న సమాచారం తెలిసినా దాన్ని పెద్ద వార్తగా మార్చాలన్న తపన తప్పించి.. తాము ఇచ్చే వార్తలో సమాచారం పూర్తిగా ఉందా? లేదా? అన్న విషయాల్ని చెక్ చేయటం మానేసి చాలా కాలమే అయిపోయింది. దీంతో.. ఏదో జరిగిందంటే.. మరేదో అయిందన్నట్లుగా వార్తలు ఇచ్చేసే ధోరణి ఎక్కువైంది.తాజాగా అలాంటిదే ఏపీ మంత్రి బొత్స సత్యానారాయణ విషయంలోనూ జరిగింది. దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత ఫోక్స్ వ్యాగన్ కేసులో ఆయనకు సీబీఐ కోర్టు నుంచి నోటీసులు అందుకున్నట్లుగా పెద్ద ఎత్తున బ్రేకింగ్ న్యూసులు వార్తలు వచ్చాయి. దీనిపై రకరకాల విశ్లేషణలు కూడా వినిపించాయి. అయితే.. తనకు వచ్చిన కోర్టు నోటీసుల అసలు విషయాన్ని వెల్లడించారు బొత్స.

ఫోక్స్ వ్యాగన్ కేసులో తాను కేవలం సాక్షిని మాత్రమేనని.. అది కూడా 60వ సాక్షిగా మాత్రమే సీబీఐ పిలిచినట్లుగా క్లారిటీ ఇచ్చారు. తాను విచారణకు హాజరవుతారన్నారు. ఇప్పటివరకూ సీబీఐ కోర్టు నుంచి వచ్చిన నోటీసులు మరో కారణంగా వచ్చినట్లుగా భావించిన విపక్షాలకు తనను సాక్షిగా పిలిచినట్లుగా చెప్పిన బొత్స మాటలతో ఆయన రాజకీయ ప్రత్యర్థులకు ఏ మాత్రం మింగుడుపడనిదిగా మారింది.