Begin typing your search above and press return to search.

అక్రమాస్తుల కేసులో బొల్లినేని అరెస్టు

By:  Tupaki Desk   |   21 April 2021 7:30 AM GMT
అక్రమాస్తుల కేసులో బొల్లినేని అరెస్టు
X
శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డదనే సామెతలాగ తయారైంది బొల్లినేని శ్రీనివాస గాంధి వ్యవహారం. ఆక్రమాస్తులను, పన్నులు ఎగొట్టేవారి పనిపట్టాల్సిన ఉన్నతాధికారి చివరకు అదే ఆరోపణలపై అరెస్టవ్వటం విచిత్రం. రాజకీయాలతో పరిచయం ఉన్న వాళ్ళకు బొల్లినేని గాంధి గురించి పెద్దగా పరిచయటం అవసరంలేదు. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల ఆరోపణల కేసుల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తరపున దర్యాప్తుచేసింది గాంధీనే.

ఈడీలో ఉండగా జగన్ను టార్గెట్ చేస్తు అనేకసార్లు నోటీసులివ్వటం, బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయటం, ఆస్తులను అటాచ్ చేయటం లాంటి చర్యలతో గాంధి బాగా వివాదాస్పదమయ్యారు. చివరకు జగన్ సతీమణి భారతి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయటమే కాకుండా విచారణ పేరుతో ఆమెకు నోటీసులివ్వటం అప్పట్లో సంచలనమైంది. ఇదే విషయమై అప్పట్లో గాంధీ వ్యవహారశైలిపై కేంద్రప్రభుత్వానికి జగన్ ఫిర్యాదులు చేశారు.

జగన్ ఫిర్యాదుతో అంతర్గతంగా విచారణ జరిపిన ఉన్నతాధికారులు గాంధి ఓవర్ యాక్షన్ చేసినట్లు నిర్ధారించుకుని వెంటనే ఆయన్ను జీఎస్టీకి బదిలీచేశారు. చంద్రబాబునాయుడు డైరెక్షన్ ప్రకారమే గాంధి నడుచుకుంటున్నట్లు జగన్ అండ్ కో చేసిన ఆరోపణలు అందరికీ గుర్తుండే ఉంటాయి. జీఎస్టీలోకి మారిన తర్వాత పన్ను చెల్లింపు విషయంలో ఓ వ్యాపారి దగ్గర నుండి రు. 5 కోట్లు లంచం తీసుకుంటు పట్టుబడ్డారు.

సీబీఐ దర్యాప్తులో గాంధికి సుమారు రు. 200 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు బయటపడ్డాయి. తన భార్య బొల్లినేని శిరీష్ పేరుమీద కూడా చాలా ఆస్తులు పెట్టినట్లు సీబీఐ గుర్తించింది. విచారణకు రమ్మని సీబీఐ ఇచ్చిన నోటీసులను గాంధి లెక్కచేయలేదు. దాంతో ఆయన ఇంటిపై దాడులు చేసిన సీబీఐ అధికారులు గాంధినీ అరెస్టు చేసినట్లు ప్రకటించారు. బీజేపీలోకి ఫిరాయించిన టీడీపీ ఎంపి సుజనాచౌదరి అక్రమాస్తుల ఆరోపణల కేసులపై సక్రమంగా దర్యాప్తు చేయలేదనే ఆరోపణలను కూడా ఎదుర్కొంటున్నారు.