కొవిడ్ వార్డులో మృతదేహాలు తారుమారు.. తెలిసే లోపే అంత్యక్రియలు

Sun May 09 2021 17:37:33 GMT+0530 (IST)

Bodies were manipulated in covid ward

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. కొవిడ్ వార్డుల్లో మరణిస్తున్న వారిని గుర్తించడం వైద్య సిబ్బందికి పెద్ద సమస్యగా మారింది. కుటుంబ సభ్యులూ మృతదేహాలను చూసే వీలు లేకుండా పోయింది. సిద్దిపేట జిల్లా కరోనా వార్డుల్లో మృతదేహాలు తారుమారు అయ్యాయి. ఓ వృద్ధురాలి మృతదేహాన్ని సంబంధం లేనివారికి అప్పగించారు. విషయం తెలిసేలోపే ఆ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. వైద్య సిబ్బందికి ఈ సమస్య పెద్ద తలనొప్పిగా మారింది.చేర్యాల మండలం వీరన్నపేట గ్రామానికి చెందిన వజ్రమ్మ అనే వృద్ధురాలిని కొవిడ్ వార్డులో చేర్చినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. పరిస్థితి విషమించి ఆమె మృతి చెందారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు వైద్య సిబ్బంది తెలియజేశారు. మరునాడు ఉదయం మృతదేహం కోసం ఆమె బంధువులు ఆస్పత్రికి వచ్చారు. కాగా మృతదేహం తమ బంధువుది కాదని వారు షాకిచ్చారు. కాగా ఆరా తీస్తే మృతదేహాలు తారుమారైనట్లు ఆస్పత్రి సిబ్బంది గుర్తించారు.

సిద్దిపేట పట్టణానికి చెందిన అదే పేరుగల మరో వృద్ధురాలు మరణించింది. వీరన్నపేట గ్రామస్థులు రావడానికి ముందే వారు వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఈ క్రమంలో పొరపాటున మృతదేహాలు తారుమారైనట్లు సిబ్బంది తెలిపారు. కాగా ఈ విషయాన్ని సిద్దిపేటకు చెందిన వృద్ధురాలి కుటంబ సభ్యులకు తెలియజేయగా... వైద్య సిబ్బంది ఇచ్చిన మృతదేహానికి అప్పటికే అంత్యక్రియలు పూర్తి చేసినట్లు తెలిపారు.

వీరన్నపేట మృతురాలి కుటంబ సభ్యులు ఆస్పత్రి నుంచి తిరిగి వెళ్లిపోయారు. సిద్దిపేట పట్టణానికి చెందిన వారికి మళ్లీ ఫోన్ చేయగా.. స్విచ్ఛాఫ్ వచ్చిందని వైద్య సిబ్బంది తెలిపారు. ఏం చేయాలో తెలియని వైద్య సిబ్బంది... మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. కరోనా విపత్కర సమయంలో ఇలాంటి ఘటనలు మరెన్ని చూడవలసి వస్తుందోనని స్థానికులు వాపోయారు.