ముకేశ్ అంబానీ పై ‘బ్లూంబర్గ్’ సంచలన కథనం..

Wed Nov 24 2021 10:59:03 GMT+0530 (IST)

Bloomberg sensational article on Mukesh Ambani

సంపాదించటం ఒక ఎత్తు. దాన్ని గొడవల్లేకుండా సాఫీగా వారసులకు పంచటం మరో ఎత్తు. ఈ రెండింటికి మించిన మరింత కష్టమైన పని.. తాను పెంచి పెద్దది చేసిన సంస్థ ఛరిష్మాను తన తర్వాత కూడా అలానే నిలపటం. ఇవన్నీ చూసేందుకు చిన్న విషయాలుగా కొందరికి అనిపించొచ్చు కానీ.. చేతల్లో మాత్రం దీనికి మించిన కష్టమైన టాస్క్ మరొకటి ఉండదు. ఆ మాటకు వస్తే.. వేలాది కోట్లు కష్టపడి సంపాదించిన వారు సైతం.. ఈ టాస్కులో అడ్డంగా ఫెయిల్ అవుతుంటారు.దేశీయంగానే కాదు.. ప్రపంచ కుబేరుల్లో టాప్ 10లో ఉన్న వారిలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఒకరు. ఆయనకు భార్య.. ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఇప్పుడు ఆయన వయసు 64. మరి.. తన తర్వాత తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఇప్పటిలానే వెలిగిపోయేలా ఉండాలంటే ఏం చేయాలి? మరి.. పిల్లలు అన్న తర్వాత వారికి తాను సంపాదించిన ఆస్తిని అప్పజెప్పాల్సి ఉంటుంది కదా? మరి.. దాన్ని ఏం చేయనున్నారు? అన్న ప్రశ్నకు సరైన సమాధానం ఇప్పటివరకు లేదు.

తాజాగా ఈ ప్రశ్నకు సమాధానం చెబుతోంది ప్రముఖ మీడియా సంస్థ ‘బ్లూంబర్గ్’.

తాజాగా ముకేశ్ అంబానీ.. తన ఆస్తుల్ని తన పిల్లలకు ఏ రీతిలో పంచబోతున్నారు? తనవ్యాపార సామ్రాజ్యాన్ని ఇప్పటిలానే ఎప్పటికి కళకళలాడేలా.. వెలిగిపోయేలా ఉండేందుకు వీలుగా ఏం చేయనున్నారన్న విషయాన్ని వెల్లడించింది. ఈ సంచలన కధనంలోని అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. అందరూ మాట్లాడుకునేలా చేస్తున్నాయి.

తన భారీ సామ్రాజ్యాన్ని తన వారసులకు అప్పగించే విషయంలో.. గతం రిపీట్ కాకూడదన్న ఆలోచనలో ముకేశ్ ఉన్నట్లు చెబుతున్నారు. తన తండ్రి కష్టంతో పెద్దదైన రిలయన్స్ సంస్థను.. ఆయన తర్వాత ఇద్దరు కొడుకులు (ముకేశ్.. అనిల్) పంచుకోవటం.. ఆ సందర్భంగా వారి మధ్య నడిచిన లొల్లి అందరికి తెలిసిందే.

అప్పట్లో జరిగిన వ్యాపార విభజన తర్వాత ముకేశ్ తన నైపుణ్యంతో రిలయన్స్ సంస్థను ఎక్కడికో తీసుకెళితే.. ఆయన సోదరుడు అనిల్ అంబానీ చేతికి వచ్చిన రిలయన్స్ సంస్థల తాజా పరిస్థితి ఎంత దారుణంగా ఉందన్న విషయం తెలిసిందే.

ఇలాంటి పరిస్థితుల్లో తన పిల్లల విషయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండటంతో పాటు..తన గ్రూప్ ఇప్పటిలానే అత్యున్నత స్థానంలో నిలవాలన్న ఆలోచన మకేశ్ లో ఉంది. దేశంలో మార్కెట్ విలువ పరంగా చూస్తే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అతి పెద్దది.

రూపాయిల్లో చెప్పాలంటే సుమారు రూ.15.60 లక్షల కోట్ల విలువైన ఈ వ్యాపార సామ్రాజ్యం అన్నింటిలోనూ ఉంది. ఇదే వైభవం భవిష్యత్తులోనూ సాగాలంటే పక్కా ప్లాన్.. అంతకుమించిన వ్యూహం అవసరం. ఇందుకోసం కసరత్తు చేస్తున్న ముకేశ్ అంబానీ తాజాగా వాల్ మార్ట్ వ్యవస్థాపకుడు శామ్ వాల్టన్ నడిచిన బాటను ఫాలో కావాలన్న యోచనలో ఉన్నట్లుగా బ్లూంబర్గ్ కథనం చెబుతోంది.

ఇందుకోసం ఒక ట్రస్టు లాంటిది ఏర్పాటు చేయటం.. తన కుటుంబ ఆస్తులన్నింటిని దానికి బదిలీ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఈ కొత్త సంస్థకే రిలయన్స్ ఇండస్ట్రీస్ పై పూర్తి నియంత్రణ ఉంటుందని చెబుతున్నారు. కొత్త సంస్థలో బోర్డు సబ్యులుగా ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ.. కుమారులు ఆకాశ్.. అనంత్.. కుమార్తె ఈశా ఉంటారు. అంతేకాదు.. ముకేశ్ కు అత్యంత సన్నిహితుల్లో కొందరిని కూడా ఉంచుతారు.

కంపెనీ ప్రధాన కార్యకలాపాలను పూర్తిస్థాయి ప్రొఫెషనల్స్ కు అప్పగిస్తారు. వారంతా బయటవారే ఉంటారు. వాల్ మార్ట్ వ్యవస్థాపకుడైన శామ్ వాల్టన్ కూడా తాను చనిపోవటానికి 40 ఏళ్ల ముందే కుటుంబ వాటాల్ని ట్రస్టుకు బదిలీ చేసి.. కుటుంబ సభ్యులకు ఆ సంస్థ బోర్డు డైరెక్టర్ బాధ్యతల్ని అప్పజెప్పారు.

ఇప్పటికీ ఆ సంస్థ చీలిపోకుండా ఉందంటే.. అందుకు ఆయన అనుసరించిన వ్యూహమేనని చెబుతారు. ఇప్పటికి వాల్ మార్ట్ లో 47 శాతం వాటాను ట్రస్టులు.. వాల్టన్ ఎంటర్ ప్రైజెస్ రూపంలో వాల్ మార్ట్ కుటుంబీకుల చేతుల్లోనే ఉండటం గమనార్హం.

రిలయన్స్ విషయానికి వస్తే.. ఇందులో అన్ని రకాలైన వ్యాపారాలు ఉన్నాయి. వీటిల్లో ఎవరికి ఏమేం చూడాలన్న దాన్ని ఇప్పటికే ఆయన ఒక అంచనాకు వచ్చి.. అందుకు తగ్గట్లే వ్యాపారాన్ని నడిపిస్తున్నారు.

కొత్త తరం వ్యాపారమైన రిటైల్.. టెలికాంలో కవలలు అయిన కొడుకు ఆకాశ్.. కుమార్తె ఈశాలకు అప్పజెప్పగా.. 26 ఏళ్ల చిన్న కొడుకు అనంత్ అంబానీకి జియో ప్లాట్ ఫామ్స్.. పునరుత్పాదక విద్యుత్.. చమురు.. రసాయనాల వ్యాపారాలకు డైరెక్టరుగా బాధ్యతల్ని అప్పజెప్పటం తెలిసిందే. ఇంత పక్కాప్లానింగ్ తో ఉన్న ముకేశ్.. తాను అనుకున్నట్లే చేయగలుగుతారా? మరింకేమైనా జరుగుతుందా? అన్నది మాత్రం కాలమే సరైన సమాధానం ఇవ్వగలదు.