Begin typing your search above and press return to search.

బ్లడీ ఇండియన్స్ అన్నారు.. ఇప్పుడు మన బూట్లు నాకుతున్నారు

By:  Tupaki Desk   |   10 Jun 2021 4:34 AM GMT
బ్లడీ ఇండియన్స్ అన్నారు.. ఇప్పుడు మన బూట్లు నాకుతున్నారు
X
భారత్ మాజీ క్రికెటర్ ఫరూక్ ఇంజనీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో తాను ఎదుర్కొన్న వివక్షపై ఆయన విరుచుకుపడ్డారు. జాతి వివక్ష వ్యాఖ్యలు ఎంత దారుణంగా ఉంటాయో.. మరెంతలా మనసును గాయపరుస్తాయో ఆయన మాటలు వింటే ఇట్టే అర్థమవుతుంది. యుక్త వయసులో ఇష్టం వచ్చినట్లుగా ట్వీట్లు చేసి.. దాని ఫలితాన్ని తాజాగా ఎదుర్కొంటున్న ఇంగ్లండ్ క్రికెటర్ ఓలీ రాబిన్సన్ ఇష్యూలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వెనకేసుకురావటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. తాజాగా ఆ జాబితాలోకి చేరారు భారత మాజీ క్రికెటర్ ఫరూక్ ఇంజనీర్.

తన కెరీర్ లో తాను ఎదుర్కొన్న జాతివివక్ష వ్యాఖ్యల్ని రివీల్ చేశారు. ఆసియా క్రికెటర్లు.. ముఖ్యంగా భారత క్రికెటర్ల విషక్ష్ంలో ఇంగ్లండ్.. ఆస్ట్రేలియా క్రికెటర్ల ప్రవర్తనను ఫరూక్ తప్పుపట్టారు. తనకు ఎదురైన చేదు అనుభవాల్ని వెల్లడించారు. తన ఇంగ్లిషు ఇంగ్లండ్ లోని చాలామంది కంటే బాగుంటుందని.. తన యాసను ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జెఫ్రీ బాయ్ కాట్.. ‘బ్లడీ ఇండియన్స్’ అని అన్నారని.. నిజానికి అతడొక్కడేకాదు మిగిలిన వారి ఆలోచన కూడా ఇలానే ఉంటుందన్నారు. తానీ తీరులో రెండుసార్లు వివక్ష ను ఎదుర్కొన్నానని చెప్పారు.

భారతీయుల విషక్ష్ంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు సైతం ఇదే రీతిలో స్పందించేవారని.. ఐపీఎల్ పుణ్యమా అని వారి మాటల్లో మార్పు వచ్చిందన్నారు. కేవలం డబ్బుల కోసం వారికి భారత్ గొప్పదేశంగా మారిందన్నారు. కేవలం డబ్బుల కోసం వారు మన బూట్లు నాకుతున్నారని.. కొన్ని నెలలు గడిపేందుకు.. భారీగా డబ్బులు ఆర్జించేందుకు వారికి భారత్ గొప్పదేశంగా మారిందన్నారు. జాతివిక్ష వ్యాఖ్యలు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇదంతా విన్న తర్వాత జెఫ్రీ బాయ్ కాట్ ను భారతీయులు ఎవరూ హర్షించే అవకాశం లేనట్లే.