Begin typing your search above and press return to search.

మహారాష్ట్రలో భారీగా పెరుగుతోన్న బ్లాక్ ఫంగస్ ... ప్రభుత్వం అప్రమత్తం !

By:  Tupaki Desk   |   13 May 2021 3:37 AM GMT
మహారాష్ట్రలో భారీగా పెరుగుతోన్న బ్లాక్ ఫంగస్ ... ప్రభుత్వం అప్రమత్తం !
X
ఓ వైపు కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో ప్రజలు వణికిపోతుండగా, ఇప్పుడు కొత్తగా బ్లాక్ ఫంగస్ మరొకటి వెలుగులోకొచ్చింది. ముఖ్యంగా దేశంలోనే ఎక్కువకేసులు నమోదు అయిన మహారాష్ట్ర లో ఒక‌వైపు క‌రోనా కేసుల‌తో పాటు, మ‌రోవైపు మ‌హారాష్ట్ర‌లో బ్లాక్ ఫంగ‌స్ కేసులు భారీ సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి. రాష్ట్రంలో దాదాపుగా రెండు వేల‌కు పైగా బ్లాక్ ఫంగ‌స్ కేసులు న‌మోద‌న‌ట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య‌శాఖ మంత్రి వెల్లడించారు. బ్లాక్ ఫంగ‌స్ కేసుల బాధితులు పెద్ద సంఖ్య‌లో ఆసుప‌త్రుల‌కు వ‌స్తుండ‌టంతో వీరికోసం మెడిక‌ల్ కాలేజీకల‌కు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల‌ను బ్లాక్ ఫంగ‌స్ చికిత్స కేంద్రాలుగా మార్చి చికిత్స అందిస్తున్నారు.

బ్లాక్ ఫంగస్ కు అందించే వైద్యం ఖ‌ర్చుతో కూడుకొని ఉండ‌టంతో వీలైనంత తక్కువ ఖ‌ర్చుతో వైద్యం అందించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మ‌హాత్మా పూలే జ‌న్ ఆరోగ్య యోజ‌న కింద చికత్స అందిస్తున్న‌ట్టు ఆరోగ్య‌శాఖ మంత్రి అన్నారు. బ్లాక్ ఫంగ‌స్ బాదితుల‌కు ఆంఫోటెర్సిన్ బీ ఇంజెక్ష‌న్‌లు అవ‌స‌రం అవుతాయ‌ని, ముందు జాగ్ర‌త్త‌లో భాగంగా ల‌క్ష ఇంజెక్ష‌న్ల కోసం టెండ‌ర్లు పిలిచిన‌ట్టు ఆరోగ్య‌శాఖ మంత్రి తెలిపారు. బ్లాక్ ఫంగ‌స్ బాదితుల్లో 50 శాతం మ‌ర‌ణాలు సంభ‌విస్తుండ‌టంతో ప్ర‌భుత్వం కూడా కొంచెం అప్రమత్తం అయ్యింది. మనుషులకు అరుదుగా సోకే ఫంగల్ ఇన్ఫెక్షన్. కరోనా సోకిన వారిలో, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది.

ముకోర్మైకోసిస్ ముకోర్ అనే ఫంగస్ వల్ల ఇది వ్యాపిస్తుంది. ఇది తడి ఉపరితలాల నుంచి ఎక్కువగా సోకుతుందని నీతి ఆయోగ్ సభ్యుడు వి కె పాల్ తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న వారికి రెండు మూడ్రోజుల్లో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. తొలుత సైనస్లో చేరి తర్వాత కండ్లపై ఇది దాడి చేస్తుంది. తర్వాత 24 గంటల్లో బ్రెయిన్ వరకు వెళ్తుంది. ఆ తర్వాత బ్రెయిన్ డెడ్ అయిన చనిపోయే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి సోకిన వారిలో ముఖం వాపు, తలనొప్పి, జ్వరం, కళ్ల వాపు, అవయవాల్లో నల్లటి మచ్చలు, ముక్కు ఒక వైపు మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన డయాబెటిస్తో ఇబ్బంది పడుతున్న వారు త్వరగా కోలుకునేందుకు స్టెరాయిడ్స్ ఇస్తున్నారని.. ఇది బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్కు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు.