Begin typing your search above and press return to search.

సీఎంల మార్పు వెనుక ఇంత తతంగం ఉందా..?

By:  Tupaki Desk   |   13 Sep 2021 7:25 AM GMT
సీఎంల మార్పు వెనుక ఇంత తతంగం ఉందా..?
X
ఇప్పటికీ రెండు సార్లు అధికారంలో కూర్చున్న బీజేపీ మరోమారు పీటమెక్కుందుకు వ్యూహ రచన చేస్తోంది. అయితే అంతకుముందు అధికారంలో ఉన్న రాష్ట్రాలను చేజారనివ్వకుండా కేంద్రం పెద్దలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇప్పటి వరకు గుజరాత్, కర్ణాటక, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ పట్టు కోల్పోకుండా ప్రణాళికను రచిస్తున్నారు. ఇందులో భాగంగానే అక్కడి ముఖ్యమంత్రులను మారుస్తున్నట్లు దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. అయితే ముఖ్యమంత్రుల మార్పులు కులాల ఓట్ల కోసమేనని కొందరు అంటున్నారు. ఆయా రాష్ట్రాల్లో సంబంధిత కుల ఓట్లు ఎక్కువగా ఉండడం వల్లే ఆ వర్గానికి చెందిన వారిని సీఎంగా నియమించారని అంటున్నారు.

దేశంలో అన్ని వర్గాల వారికి అనుగుణంగా బీజేపీ నడుచుకుంటుందని పార్టీ పెద్దలు అప్పుడప్పుడు ప్రసంగాలు చేస్తుంటారు. అయితే పార్టీలోని కొందరు నాయకులు మాత్రం హిందుత్వ పార్టీ అనే ధోరణిలోనే వెళ్తుంటారు. ఎందుకంటే కేంద్రంతో పాటు చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీలో ఇతర మతాలకు చెందిన వారికి అవకాశం ఇవ్వలేదు. కేంద్రంలోనే కాదు, కనీసం రాష్ట్రాల్లోనూ వారికి పదవులు కట్టబెట్టలేదు. ఈ అపవాదును పోగొట్టడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2017 ఎన్నికల్లో జైన్ మతానికి చెందిన విజయ్ రూపానీని ముఖ్యమంత్రిని చేశారు. దీంతో ప్రధానమైన పోస్టుల్లో ఎవరికీ తెలియని వ్యక్తిని నియమిస్తారన్న మంచిపేరు తెచ్చుకున్నారు.

2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో 2022లో ఎలక్షన్ నిర్వహించనున్నారు. అయితే ఇప్పటి వరకు సీఎంగా ఉన్న విజయ్ రుపానీ సామాజిక వర్గం మొత్తంగా 2 శాతం మాత్రమే ఓట్లు ఉన్నాయి. పలు నియోజకవర్గాల్లో పటీదార్ల ఓట్ల మెజారిటే ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి చెందిన భూపేంద్ర పటేల్ కు కూర్చొబెట్టారు. దీంతో ఇక్కడ నరేంద్ర మోడీ ‘కుల’ కట్టుబాటుకు ఉన్నట్లు తెలుస్తోంది.

అంతకుముందు కర్ణాటక విషయంలోనూ ఇదే జరిగినట్లు అర్థమవుతుంది. లింగాయత్ వర్గానికి చెందిన యడ్యూరప్పను తొలగించి మళ్లీ అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే నియమించారు. దీంతో ఇక్కడ లింగాయత్ వర్గానికి పెద్దపీట వేశారు. ఎందుకంటే ఇక్కడ వారి ఓట్లే అధికంగా ఉన్నాయి. అయితే ఎక్కువ ఓట్లు ఉన్న సామాజిక వర్గానికి చెందిన వారిని ఆకట్టుకోవడంలో బీజేపీ ఎప్పటి నుంచో సఫలీ కృతమవుతోంది. అయితే అధికారంలోకి వచ్చిన మొదట్లో ఈ పద్దతిని పాటించేవారు కాదు. అన్ని వర్గాలకు సమానమని చెప్పుకుంటూ ఎవరికీ తెలియన వ్యక్తిని సీఎం సీట్లో కూర్చోబెట్టారు.

కానీ పరిస్థితులు మారుతున్న కొద్దీ బీజేపీ కుల కట్టుబాట్లకు అనుగుణంగా మారుతోంది. అందుకే ఎన్నికల ముందే సీఎంలను మార్చుతుంది. మరోవైపు పార్టీ క్యాడర్ ను కాపాడుకునేందుకు కూడా ముఖ్యమంత్రుల మార్పు ఉంటుందని కొందరు అంటున్నారు. అయితే పార్టీని పట్టించుకోని వారికి ఇదొక హెచ్చరికలా మారి పార్టీని కాపాడుకునే అవకాశం ఉంది. అయితే ముఖ్యమంత్రుల మార్పుల ద్వారా బీజేపీ లాభపడుతుందా...? నష్టపోతుందా..? అనేది త్వరలో జరిగే ఎన్నికల్లో తేలనుంది. ఈ పరిస్థితిని భట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వ్యూహరచన చేయనున్నట్లు తెలుస్తోంది.

అయితే బీజేపీ మతంలో, కులంలో ఐక్యంగా ఉంటామని చెబుతూ ఇలా ముఖ్యమంత్రులు మార్చడం ద్వారా కింది స్థాయి కార్యకర్తల్లో కొంత నిరాశ ఏర్పడే అవకాశం లేకపోలేదు. అయితే పెద్దగా ప్రభావం పడకపోవచ్చు. మొత్తంగా ఎక్కవగా నష్టపోకుండా బీజేపీ ముందుచూపు చూస్తోంది. అంతకుముందు రాష్ట్రాల ఎన్నికలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రుల అభ్యర్థులను ప్రకటించకుండా మోడీనే ప్రచారం చేస్తూ వస్తున్నారు. మోడీ చరిష్మాతో చాలా రాష్ట్రాల్లో కమలం విజయం సాధిస్తుంది. కానీ మోడీపై వస్తున్న వ్యతిరేకతతో ఇప్పుడు అలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చని అంటున్నారు.