Begin typing your search above and press return to search.

విశాఖ స్టీల్ దెబ్బ .. ఆ 'బై పోల్' పోటీ నుండి బీజేపీ తప్పుకుంటుందా !

By:  Tupaki Desk   |   1 March 2021 11:30 AM GMT
విశాఖ స్టీల్ దెబ్బ .. ఆ బై పోల్ పోటీ నుండి బీజేపీ తప్పుకుంటుందా !
X
జనసేన .. గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన జనసేన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని వ్యూహత్మంగా అడుగులు వేస్తోంది. బీజేపీ భాగస్వామ్య పక్షంగా చేరి, ఏపీలో నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తోంది. సీట్లు పంపకాలు, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాల్లో ఎలాంటి సొంత నిర్ణయాలు తీసుకోకుండా బీజేపీ నీడలో మెలుగుతోంది. ఇక ఈ క్రమంలోనే జీహెచ్‌ఎంసీ ఎ‍న్నికల్లో పోటీ చేస్తామని తొలుత ప్రకటించిన పవన్‌, మూడు రోజులకే మాటమార్చారు. జనసేన ప్రకటనతో రంగంలోకి దిగిన బీజేపీ నేతలు జీహెచ్ ‌ఎంసీ బరిలో నుంచి పవన్‌ ను తప్పించారు. వెంటనే బీజేపీ అభ్యర్థులకు మద్దతును సైతం ప్రకటించారు. ఈ పరిణామం జనసైనికుల ఆగ్రహాం, అసంతృప్తి, నిరాశకు దారితీసింది.

ఇదిలా వుంటే త్వరలో జరగబోయే తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీనే పోటీ చేసేది అంటూ బీజేపీ నానా హడావిడి చేసింది. వ్యూహాలు, స్థానిక త‌ట‌స్థుల‌తో మీటింగులు నిర్వ‌హించారు. ఇక ఈ ఉప ఎన్నిక టికెట్ విష‌యంలో త‌మ మిత్ర‌ప‌క్షం జ‌న‌సేన‌తో కూడా బీజేపీ చాలా క‌స‌ర‌త్తు చేసింది. జ‌న‌సేన పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతూ ఉండ‌టంతో అలాంటి అవ‌కాశ‌మే లేద‌న్న‌ట్టుగా బీజేపీ నేత‌లు ప్ర‌క‌ట‌న‌లు చేశారు. అయితే గత లోక్‌సభ ఎ‍న్నికల్లో బీజేపీ అభ్యర్థికి కేవలం 16 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. సామాజిక సమీకరణాలు, పవన్‌ ఫాలోయింగ్‌ ను దృష్టిలో ఉంచుకుని సీటుకే కేటాయించాలని జనసేన డిమాండ్‌ చేస్తోంది. మరోవైపు తిరుపతి విజయం తమదేనని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు.

ఇక రిజ‌ర్వ‌డ్ నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో దానికి త‌గ్గ‌ట్టుగా పేర్ల‌ను వ‌దిలారు. ప‌క్క రాష్ట్రంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి పేరు కూడా తెర‌పైకి వ‌చ్చింది. ఇంత క‌స‌ర‌త్తు చేసి కూడా అనూహ్యంగా బీజేపీ ఆ పోటీ నుంచి తప్పుకోనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం అనే తెలుస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌ను బీజేపీ ఎలా స‌మ‌ర్థించుకున్నా, దాన్ని ఎంత‌గా చిన్న‌ది చేసి చూపినా, దాని దెబ్బ ఎలా ఉంటుందో బీజేపీ ముందే ఊహిస్తుంది. దీనితో ఏపీలో తమ ఉనికిని చాటుకోవడానికి ఉప‌యోగించుకోవాల‌నుకున్న బై పోల్ పోటీ నుంచినే బీజేపీ త‌ప్పుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే , ఈ స్థానంలో విజయం కోసం అధికార పక్షం వైసీపీ , ప్రతి పక్షం టీడీపీ కూడా ఇప్పటికే వ్యూహాలు అమలు చేస్తున్నాయి.