Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు చేతకాకుంటే రూ.100 కోట్లు కేంద్రం నుంచి తెస్తాడట

By:  Tupaki Desk   |   23 Feb 2021 2:30 PM GMT
కేసీఆర్ కు చేతకాకుంటే రూ.100 కోట్లు కేంద్రం నుంచి తెస్తాడట
X
ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ కు మహాదూకుడు ఎక్కువ. మిగిలిన రాజకీయ పార్టీలతో పోలిస్తే..ఆ పార్టీని ఎదుర్కొనటం అంత తేలికైన విషయం కాదు. ఎప్పుడు ఎలా రియాక్టు అవుతారో? మరెప్పుడు విమర్శలతో విరుచుకుపడతారో అర్థమయ్యేది కాదు. మారిన కాలంతో పాటు.. ఉద్యమ పార్టీ కాస్తా రాజకీయపార్టీగా మారిన తర్వాత నుంచి ఆ పార్టీలో ఫైటింగ్ స్పిరిట్ తగ్గినట్లైంది. దీనికి తోడు చేతిలో అధికారం ఉండటంతో ఫైట్ చేసే ప్రక్రియను పక్కన పెట్టేసినట్లుగా పలువురి నోట వినిపిస్తుంది.

ఈ మాటకు బలం చేకూరేలా టీఆర్ఎస్ నేతల తీరు ఉందని చెప్పాలి. పార్టీపై పెద్ద ఎత్తున విమర్శల దాడి జరుగుతుంటే.. వాటికి కౌంటర్లు ఇచ్చే విషయంలో గతంలో మాదిరి గులాబీ నేతలు వ్యవహరించటం లేదన్న ఆరోపణ ఉంది. టీఆర్ఎస్ లో ఏమైతే మిస్ అయ్యిందో.. సరిగ్గా ఆ విషయాల్ని తనలో నింపుకున్న బీజేపీ.. అధికార పార్టీకి సవాలుగా మారింది. మాటల్లోనూ.. చేతల్లోనూ వాడివేడిగా కమలనాథులు వ్యవహరిస్తున్నారు.

గతంలో టీఆర్ఎస్ నేతల్లో ఎలాంటి దూకుడు కనిపించేదో.. ఇప్పుడు అలాంటి తీరే కమలనాథుల్లో కనిపించటం గమనార్హం. దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ రావుతాజాగా మాట్లాడుతూ.. తన దృష్టిలో కేసీఆర్ సన్నాసి అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదన్నారు. ఆదివాసీలకు భూపట్టాలు ఇస్తారంటే వారి పార్టీలో చేరిన వైనాన్ని గుర్తు చేశారు.

భద్రాద్రి ఆయలాన్ని దర్శించిన ఆయన.. ఆలయం కోసంరూ.100 కోట్లు కేటాయిస్తానని సీఎం కేసీఆర్ చెప్పారని.. ఇప్పటివరకు ఆ పని చేయలేదన్నారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తానని చెప్పిన కేసీఆర్ మాట ఏళ్లు గడిచిన తర్వాత కూడా తన మాటను నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ కు చేతకాదని ఒప్పుకుంటే నెల రోజుల్లో ఆలయ అభివృద్ధికి కేంద్రం నుంచి రూ.100 కోట్ల మొత్తాన్ని తీసుకొస్తానని సవాల్ విసిరారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలకే దిక్కు లేకుంటే.. రూ.100 కోట్ల భద్రాద్రికి తీసుకురాగలరా? అంటే లేదనే చెప్పాలి. కానీ.. ఆయన తేవాలంటే సీఎం కేసీఆర్ తనకు చేతకాదని ఒప్పుకోవాలి కదా?

అంత పెద్ద మాట కేసీఆర్ నోటి నుంచి రావటం అసాధ్యం. అంటే.. కేంద్రాన్ని ఒప్పించి రూ.100 కోట్లు తేవాల్సిన అవసరం లేదు. అందుకే.. అంత ధీమాగా ఎమ్మెల్యే రఘనందన్ సవాలు విసిరారని చెప్పాలి. ఇన్ని మాటలు చెప్పే రఘునందన్.. వీలైనంత త్వరగా పసుపు బోర్డు తీసుకొస్తే సరిపోతుంది కదా?వాస్తవానికి తెలంగాణకు పసుపు బోర్డు కేటాయించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్న వేళలో.. ఆ పనేదో చేసి పుణ్యం కట్టుకోవచ్చుగా రఘునందన్.