సొంత నిర్ణయాలే.. సోముకి శత్రువులా?

Mon Feb 22 2021 14:00:01 GMT+0530 (IST)

Bjp Leaders Fires On Somu Veerraju

``ఏం చేస్తాం.. తుడిచి పెట్టుకుపోయాం``- ఇదీ తాజాగా రాష్ట్రంలో జరిగిన నాలుగు విడతల పంచాయతీ ఎన్నికలపై రాష్ట్రంలోని బీజేపీ కీలక నాయకుడు ఒకరుచేసిన వ్యాఖ్య. నిజమే. 2013లో సుమారు 25 పంచాయతీలను బీజేపీ మద్దతు దారులు సంపాయించుకున్నారు. ఇప్పుడు వీటి సంఖ్య 10కి అటు ఇటు గా ఉంటుందని అంచనా. దీనిపై అంతర్మథనం సాగుతోంది. రాష్ట్రంలో  పార్టీని నడిపించే నాయకుడు మారినా.. పార్టీ నడత మాత్రం మారలేదని.. తాజా ఫలితాలతో రుజువు అవుతోందని అంటున్నారు పార్టీ నేతలు. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా ఉన్న సోము వీర్రాజుపై పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.``పంచాయతీ ఎన్నికలకు ముందు నుంచి ఒక వ్యూహం ప్రకారం ముందుకు సాగాలని సూచించాం. పంచా యతీ ఎన్నికలకు వ్యూహం ఎందుకు?  అన్నారు. ఇప్పుడు ఫలితాలు వచ్చాక.. ఏం చేయాలో ఆలోచిస్తు న్నా మంటున్నారు. ఇలా అయితే.. పార్టీ బలపడేది ఎప్పుడు.. అధికారంలోకి వచ్చేది ఎప్పుడు?`` అనిసద రు నాయకుడు ప్రశ్నించడం గమనార్హం. మొత్తంగా చూస్తే.. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి దారుణంగా ఉంద నేది వాస్తవం. దీనికి ఎవరిని నిందించాలి?  ఎప్పటి నుంచో పార్టీ పరిస్థితి ఇంతే! అని సరిపెట్టుకుందామా?  లేక ఏమైనా చేద్దామా? అని కింది స్థాయి నాయకులు ప్రశ్నిస్తున్నారు.

మరో వైపు సోము వీర్రాజు తీసుకుంటున్న నిర్ణయాలతో పార్టీ పరువు పోతోందని.. అందుకే ప్రజలు విశ్వసిం చడం లేదని పార్టీ లో సీనియర్ల మధ్య చర్చ సాగుతోంది. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను వదిలేసి.. కేవలం ఆరోపణలు.. ప్రత్యారోపణలు అన్న విధంగా సోము వ్యవహరిస్తున్నారనేది పార్టీ నేతల అభిప్రాయంగా ఉంది. కాపు సామాజిక వర్గాన్ని చేరువ చేసేందుకు చేసిన ప్రయత్నం.. అన్ని వర్గాల ప్రజలపైనా చూపించాలన్న అభిప్రాయాన్ని సోము పట్టించుకోవడం లేదని వారు అంటున్నారు. అంతేకాదు.. కేవలం విమర్శలతో సరిపెట్టడం కాకుండా.. ప్రజలకు చేరువ అయ్యేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నా.. సోము పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. సోము తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయని అంటున్నారు.