Begin typing your search above and press return to search.

లోక్ సభలో బండికి దిమ్మ తిరిగే షాక్ తగిలింది.. టీఆర్ఎస్ ఫుల్ హ్యాపీ

By:  Tupaki Desk   |   21 July 2021 5:45 AM GMT
లోక్ సభలో బండికి దిమ్మ తిరిగే షాక్ తగిలింది.. టీఆర్ఎస్ ఫుల్ హ్యాపీ
X
కీలక స్థానాల్లో ఉన్న వారికి తొందరపాటు ఏ మాత్రం పనికి రాదు. ఒక్క తప్పు చాలు.. అప్పటివరకు సొంతం చేసుకున్న ఇమేజ్ మొత్తం సంకనాకిపోవటానికి. గతానికి భిన్నంగా సోషల్ మీడియా.. వాట్సాప్ గ్రూపులు అత్యంత శక్తివంతంగా మారిన నేపథ్యంలో.. నేతలు.. అధినేతలు వేసే ప్రతి అడుగు మీదా లక్షలాది మంది ఒక కన్నేసి ఉంచుతారన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. మరేం జరిగిందో కానీ.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కు తాజాగా ఊహించని షాక్ తగిలింది.

మూర్తీభవించిన ఆవేశం.. అదే సమయంలో కొన్ని సాంకేతిక అంశాల మీద అవగాహనారాహిత్యం.. పెద్దగా చదువుకోకపోవటం.. విషయాల్ని తెలుసుకోవాలన్న ప్రత్యేక ఆసక్తి లేకపోవటం ఆయన్ను ఇబ్బందుల్లోకి గురి చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కావొచ్చు.. మంత్రి కేటీఆర్ తో సహా ఎవరి మీదనైనా సరే.. ఇన్ స్టెంట్ గా ఒంటి కాలి మీద లేచి.. విరుచుకుపడే బండి సంజయ్ మాటల్లో కొన్ని మాత్రమే అతికినట్లు ఉంటాయి. సబ్జెక్టు పరంగా చూస్తే.. ఆయనలో విషయం లేని వైనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది.

అందుకే కొన్ని వర్గాల్ని విపరీతంగా ఆకర్షించే బండి సంజయ్.. మరికొందరి మీద పెద్ద ప్రభావం చూపించలేని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మరింత ఎదగకపోవటానికి.. దూసుకెళ్లకపోవటానికి ఇదో కారణమని చెప్పాలి. బాగా చదువుకున్న వారు మాత్రమే రాజకీయాలు చేయాలా? అన్న సందేహం అక్కర్లేదు. పెద్దగా చదువు లేకున్నా.. సెన్సుబుల్ గా ఆలోచించటం.. లాజిక్ లను మిస్ కాకుండా ఉండటం.. సాంకేతి అంశాల మీద అదే పనిగా సమాచారం తెప్పించుకొని.. దాని మీద అవగాహన పెంచుకున్న తర్వాత మాత్రమే ఆ ఇష్యూల్ని ప్రస్తావిస్తూ సక్సెస్ అయిన వారు చాలామందే కనిపిస్తారు.

బ్యాడ్ లక్ ఏమంటే.. వెనుకా ముందు ఆలోచించకుండా బండి సంజయ్ మాట్లాడేస్తుంటారు. మాటలే కాబట్టి.. కాస్త అటుఇటుగా సర్దుకోవచ్చు. కానీ.. లోక్ సభలో సొంత సర్కారును ప్రశ్నించే వేళలో..తాను సంధిస్తున్న ప్రశ్నకు సంబంధించిన పూర్తి అవగాహన చాలా అవసరం. కానీ.. ఆ విషయాన్ని మర్చిపోయి రాష్ట్రానికి వచ్చిన 14.. 15 ఫైనాన్స్ కమిషన్ నిధుల గురించి ప్రశ్నను సంధించిన బండి సంజయ్.. ఊహించని రీతిలో సమాధానం ఎదురైంది. సొంత ప్రభుత్వానికి సందేహాన్ని సంధించినప్పుడు.. వెనుకా ముందు చూసుకోవాలి. కానీ.. ఇదేమీ చేయని బండి సంజయ్.. లోక్ సభలో.. రాష్ట్రానికి వచ్చిన ఫైనాన్స్ కమిషన్ నిధుల సమాచారాన్ని.. కేంద్రం జోక్యాన్ని ప్రశ్నించారు.

దీనికి లిఖితపూర్వకంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇస్తూ.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారికంగా వచ్చే నిధులపై కేంద్రానికి ఎలాంటి పవర్ ఉండదని స్పష్టం చేశారు. ఈ అంశంపై తాజాగా టీఆర్ఎస్ తీవ్రంగా రియాక్టు అయ్యింది. తెలిసి తెలియక ప్రశ్నను అడిగారన్న విషయం అర్థమవుతున్నా.. బండి సంజయ్ మీద సొంత ప్రభుత్వం ఏ మాత్రం కనికరం లేకుండా పంచ్ ఇచ్చిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తెలిసి తెలియనితనంలో ప్రశ్నలు సంధించి పార్లమెంటు సాక్షిగా బండి సంజయ్ పరువు తీసుకున్నారంటూ టీఆర్ఎస్ సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం షురూ చేసింది. తమను అదే పనిగా విమర్శించే బండికి సంబంధించి బందరు లడ్డూ లాంటి ఇష్యూ ఒకటి లభించటంతో.. ఆయనపై వ్యంగ్య వ్యాఖ్యలతో విరుచుకుపడుతోంది గులాబీ దళం. బండి సంజయ్ కు కీలక విషయాల మీద అవగాహన రాహిత్యం ఎంతఉంటుందన్న విషయాన్ని అర్థమయ్యేలా టీఆర్ఎస్ పోస్టు ఉంది. ఈ ఎపిసోడ్ తర్వాత అయినా ప్రశ్నల్ని సంధించే వేళలో.. బండి సంజయ్ కాసింత జాగ్రత్తగా వ్యవహరిస్తే బాగుంటుందన్న మాట పలువురి నోటి నుంచి వస్తోంది.