Begin typing your search above and press return to search.

ఆ దేశంలో రికార్డు స్థాయిలో పడిపోయిన జననాలు..!

By:  Tupaki Desk   |   29 Nov 2022 4:18 AM GMT
ఆ దేశంలో రికార్డు స్థాయిలో పడిపోయిన జననాలు..!
X
ప్రపంచ జనాభా 2022 నవంబర్ 15 నాటికి 800 కోట్లకు చేరింది. ఈ విషయాన్ని స్వయంగా ఐక్య రాజ్య సమితినే వెల్లడించింది. 2023 ఏడాది నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించబోతుందని యూఎన్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ పేర్కొంది. కొన్ని దశాబ్దాలుగా చైనా పేరిట ఉన్న రికార్డును త్వరలోనే భారత్ తన పేరిట లిఖించబోతుండటం విశేషం.

మరోవైపు కొన్ని దేశాల్లో మాత్రం జనాభా పెరుగుదల గణనీయంగా పడుతుండటం ఆందోళనను రేకెత్తిస్తోంది. 2050 నాటికి ప్రపంచ జనాభా ఎనిమిది దేశాల్లోనే సగం కంటే ఎక్కువగా నమోదు అవుతుందని యూఎన్ వరల్డ్ పాపులేషన్ అంచనా వేసింది. అంటే మిగిలిన దేశాలు ప్రజలు జనాభా పెరుగుదలపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదని అర్థమవుతుంది.

అయితే ఆయా దేశాల్లో జనాభా తగ్గుదలకు అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా జపాన్లో జనాభా పెరుగుదల గణనీయంగా క్షీణించడంపై ఆందోళన నెలకొంది. ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్న జపాన్ ఇటీవలీ కాలంలో జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటుడటంపై ఆదేశ చీప్ కేబినెట్ సెక్రటరీ హిరోకజూ మట్ సునో విచారం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే జపాన్లో వివాహాలు.. జననాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక స్కీములను అమలు చేసేందుకు చర్యలు చేపడుతోంది. 12.5 కోట్ల జనాభా కలిగిన జపాన్లో గడిచిన రెండు దశాబ్దాలుగా జపాన్లో జనాభా రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇక గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం జననాల సంఖ్య ఐదు శాతం మేర క్షీణించింది.

2060 నాటికి జపాన్ జనాభా 8.6కోట్లకు చేరుకుంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గతేడాది కేవలం 8.11లక్షల జననాలు మాత్రమే నమోదయ్యాయి. గతేడాదితో పొలిస్తే ఈ సంఖ్య 4.9శాతం మేర తక్కువగా నమోదైంది. జపాన్లో ప్రతి యేటా జనాభా రేటు తగ్గుతూ పోతే దేశం క్లిష్టమైన పరిస్థితిలో వెళ్లే అవకాశం ఉందని జపాన్ చీఫ్ సెక్రటరీ హిరొకజూ మట్ సునో తెలిపారు.

రాబోయే రోజుల్లో ఈ అంశం జాతీయ శక్తిని క్షీణింపజేస్తుందని ప్రభుత్వానికి సైతం నివేదించారు. జపాన్లో జీవన ప్రమాణ కాలం అత్యధికం ఉండటం.. జీతాల్లో పెరుగుదల లేకపోవడం.. ఉద్యోగాల కల్పనలో స్పష్టత లేకపోవడం.. ప్రయాణ భారం.. కార్పొరేట్ కల్చర్ వంటి అంశాలు కుటుంబ వ్యవస్థ.. పెళ్లిళ్లపై యువతను విసిగెత్తిపోయేలా చూస్తుందని ఒక సర్వేలో వెల్లడైంది.

ఈ నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం గర్భిణీలు.. బాలింతలు.. చిన్నారుల కోసం ప్రత్యేక సబ్సిడీ కార్యక్రమాలను అమలు చేస్తోంది. అయితే ఇవన్నీ కూడా జనాభా పెరుగుదలకు ఏ మాత్రం దోహదం చేయడం లేదని తెలుస్తోంది. దీంతో త్వరలోనే జపాన్ సర్కార్ జనాభా పెరుగుదల విషయంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.