పెంపుడు కుక్కలపై బిన్ లాడెన్ రసాయన ప్రయోగాలు..!

Sat Dec 03 2022 18:14:23 GMT+0530 (India Standard Time)

Bin Laden chemical experiments on pet dogs

అమెరికా మోస్ట్ వాంటేడ్ టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాడెన్ మరణించి దశాబ్దం గడిచిపోయిన అతడి గురించి నిత్యం ఏదో ఒక సంచలన వార్త బయటికొస్తూనే ఉంది. 11 సెప్టెంబర్ 2001లో బిన్ లాడెన్ అమెరికాలోని ట్వీన్ స్విటీస్ పై దాడి.. పెంటాగన్ లో వైమానిక దాడులతో అల్లకల్లోలం సృష్టించగా యావత్ ప్రపంచం ఆందోళనకు గురైంది. అమెరికా చరిత్రలో 9/11 చీకటి రోజుగా మిగిలిపోయింది. ఈ ఘటన తర్వాత అమెరికా లాడెన్ పై ప్రతీకారంతో రగిలిపోయింది. అమెరికా మిలిటరీ ఆపరేషన్ చేపట్టి 2011లో బిన్ లాడెన్ ను అంతమొందించిన సంగతి తెల్సిందే. దీంతో అప్పటి వరకు ప్రపంచ మోస్ట్ వాంటెడ్ టెరరిస్టుగా ఉన్న బిన్ లాడెన్ కథ ముగిసిపోయింది. దీంతో అమెరికా సహా చాలా దేశాలు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే బిన్ లాడెన్ బ్రతికున్న సమయంలో పెంపుడు కుక్కలపై రసాయన ప్రయోగాలు చేసేవాడని అతడి భార్య నజ్వా బిన్ లాడెన్ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ‘‘గ్రోయింగ్ అప్ బిల్ లాడెన్: ఒసామాస్ వైఫ్ అండ్ సన్ టేక్ అస్ ఇన్‌సైడ్ దెయిరె సీక్రెట్ వరల్డ్’’ పుస్తకంలో నజ్వా బిన్ లాడెన్ ఈ విషయాలు వెల్లడించింది.

ఆ పుస్తకంలో తన భర్త బిన్ లాడెన్ జీవితంలోని పలు ఆసక్తికర.. భయంకరమైన నిజాలను రాసుకొచ్చింది. సాధారణంగా ముస్లింలు కుక్కలను పెంచుకోవడాన్ని తప్పుగా భావిస్తారని తెలిపింది. కానీ బిన్ లాడెన్ కు కుక్కలంటే చాలా ఇష్టంమని పేర్కొంది. దీంతో రెండు జర్మన్ షెపర్డ్ లను యూరప్ నుంచి తీసుకొచ్చి బిన్ లాడెన్ పెంచుకునేవాడని తెలిపింది.

ఆ కుక్కలకు సాఫియర్.. జాయర్ అని పేర్లు పెట్టాడని.. వీటిని ఖార్తూమ్‌లో లాడెన్ తండ్రి జాగ్రత్తగా చూసుకుంటున్నారని బిన్ లాడెన్ తరుచూ చెప్పడం తనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించేదని తెలిపింది. ఎందుకంటే కుక్కలను దూరంగా పెట్టాలని ముస్లింలకు మత పెద్దలు చెబుతుంటారని పేర్కొంది. లాడెన్ కుటుంబం మాత్రం దీనిని పెద్దగా పట్టించుకోలేదని ఆమె తన పుస్తకంలో రాసుకొచ్చింది.

ఈ పుస్తకంలోని 17వ చాప్టర్లో బిన్ లాడెన్ శునకాల గురించి వివరిస్తూ ‘‘ఒక కుక్కను ఎవరో దొంగతనం చేశారని.. మరొక కుక్కకు వింత వ్యాధి సోకి చాలా రోజులు బాధపడి చనిపోయిందని’’ నజ్వా పేర్కొంది. ఇక ఈ పుస్తకం ప్రచురితమైన ఏడేళ్ల తర్వాత ‘‘ద సన్’’ వార్తాపత్రికకు బిన్ లాడెన్ కుమారుడు ఒమర్ బిన్ లాడెన్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు.

తన తండ్రి బిన్ లాడెన్ రసాయన ఆయుధాలను కుక్కలపై ప్రయోగించేవాడని తెలిపి అందరినీ షాకింగ్ కు గురిచేశాడు. తాను లాడెన్‌తో ఉన్న సమయంలోనే కుక్కలపై రసాయన ఆయుధాలను పరీక్షించారని తెలిపాడు. ఒక ఆయుధాన్ని తమ పెంపుడు శునకంపై కూడా ప్రయోగించారని వెల్లడించాడు.

ఆప్పుడు తనకు ఎంతో బాధ అనిపించిందని ఒమర్ ఆ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఈ విషయాన్ని మరచిపోవడానికి చాలా ప్రయత్నించానని.. అయితే దీనికి చాలా సమయం పట్టిందని తెలిపాడు. ఇక తన తండ్రితో అప్ఘనిస్తాన్ లో జీవిస్తున్నప్పుడు బాబీ అనే పెంపుడు కుక్క ఉండేదని దీనిని పోలీస్ జాగిలం తరహాలో ట్రైనింగ్ ఇచ్చేవాడని గుర్తు చేసుకున్నాడు.

చాలా రోజుల తర్వాత ఆ కుక్క మరణించిందని.. అయితే ఎందుకు మరణించిందో మాత్రం తెలియదని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని పరిశీలిస్తే అఫ్ఘన్ లోని టెర్రరిస్టుల వద్ద రసాయన ఆయుధాలు ఉన్నాయని అర్థమవుతోంది. జంతువులు లేదా ఇతర మార్గాల ద్వారా ఈ రసాయన ఆయుధాలను టెరరిస్టులు ప్రయోగిస్తే మాత్రం పెను ప్రమాదం తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.