Begin typing your search above and press return to search.

విదేశీ విద్యార్థులకు షాకిచ్చేలా అమెరికాలో బిల్లు.. ఆమోదం పొందితే మనోళ్లకు భారీ దెబ్బ

By:  Tupaki Desk   |   30 July 2021 9:24 AM GMT
విదేశీ విద్యార్థులకు షాకిచ్చేలా అమెరికాలో బిల్లు.. ఆమోదం పొందితే మనోళ్లకు భారీ దెబ్బ
X
డాలర్ డ్రీమ్స్ ను సాకారం చేసుకోవటానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని అనుసరిస్తారు. కొందరు ఉపాధిలో భాగంగా అమెరికాకు వెళ్లే ప్రయత్నం చేస్తే.. మరికొందరు ఉన్నత విద్యను అమెరికాలో అభ్యసించటం ద్వారా తమ అమెరికా కలను సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి కలను దెబ్బ తీసేలా తాజాగా ఒక బిల్లును అమెరికా చట్టసభలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

‘ఫెయిర్‌నెస్‌ ఫర్‌ హై-స్కిల్డ్‌ అమెరికన్స్‌ యాక్ట్‌ పేరుతో ప్రతినిధుల సభలో ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ బిల్లు సారాంశం ఏమంటే.. విదేశీ విద్యార్థులు అమెరికాలో చదువుతూ ఉంటే.. వారు కోర్సు పూర్తి చేసిన వెంటనే.. తట్టాబుట్టా సర్దుకొని తమ స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుందే తప్పించి.. అమెరికాలో ఉండే అవకాశం ఉండదు. అదే జరిగితే అమెరికాలో చదువకునే విదేశీ విద్యార్థుల ప్రయోజనాలు భాగా దెబ్బ తీస్తాయి.
అమెరికాలోని విద్యా సంస్థల్లో చేరే వారిలో కొందరు.. ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టీస్ ట్రైనింగ్) కింద చేరుతుంటారు. ఇలాంటి కోర్సులు చేసే వారు.. తమ కోర్సులు పూర్తి అయ్యాక అమెరికాలోనే ఉండి ఉద్యోగం వెతుక్కుంటూ ఉంటారు. ఇలాంటి వారి ప్రయోజనాలు దెబ్బ తినేలా.. చట్టంలో మార్పు తేవాలన్నది తాజా బిల్లు డిమాండ్. ఇదే కనుక చట్టరూపం దాలిస్తే.. విదేశీ విద్యార్థుల ప్రయోజనాలకు దెబ్బ పడుతుంది.

మరి.. ముఖ్యంగా మన దేశానికి చెందిన 80వేల మంది విద్యార్థుల వరకు అమెరికాలోని పలు విద్యా సంస్థల్లో వివిధ కోర్సుల్ని చేస్తుంటారు. తమ చదువు పూర్తి అయ్యాక.. అమెరికాలో ఉండి తగిన ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటారు. అయితే.. విదేశీ విద్యార్థులకు తక్కువ జీతాలకే ఉద్యోగాలు ఇచ్చేస్తుండటం వల్ల అమెరికన్ల ప్రయోజనాలకు దెబ్బ పడుతోందన్న ఆందోళన ఉంది. సరిగ్గా ఇదే పాయింట్ ను అసరాగా చేసుకొని.. తాజాగా బిల్లును అమెరికాలోని ప్రతినిధుల సభలో ప్రవేశ పెట్టారు.

అయితే.. ఈ బిల్లును ప్రవేశ పెట్టింది విపక్ష రిపబ్లిక్ పార్టీకి చెందిన నేత కావటంతో ఈ బిల్లు ఆమోదం పొంది చట్టంగా రూపొందే అవకాశం తక్కువగా ఉందంటున్నారు. అయితే.. అమెరికన్ల ప్రయోజనాల్ని దెబ్బతీసేలా బైడెన్ సర్కారు తీరు ఉందన్న విమర్శలు పెరిగితే.. ఈ బిల్లు ఆమోదం పొందినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. ఏమైనా విదేశీ విద్య కోసం అమెరికాకు వెళ్లి.. అక్కడ ఉపాధి అవకాశాల మీద ప్రణాళికలు ఉన్న వారు మాత్రం.. ముందే తమ వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.