ప్రపంచానికే షాక్.. విడిపోతున్నట్లుగా ప్రకటించిన గేట్స్ దంపతులు

Tue May 04 2021 09:00:00 GMT+0530 (IST)

Bill and Melinda Gates divorce

ప్రపంచంలో మరే జంటకు లేని గుర్తింపు వారి సొంతం. అపర కుబేరుడిగా.. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడిగా సుపరిచితమైన బిల్ గేట్స్ ఆయన సతీమణి మిలిందాలు విడాకులు తీసుకున్నారు. 27 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లుగా ప్రకటించి సంచలనంగా మారారు. ప్రపంచంలో చాలామంది సెలబ్రిటీ దంపతులు ఉండొచ్చు. కానీ.. తమ సేవా కార్యక్రమాల కోసం భార్యతో కలిసి బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ను ఏర్పాటు చేయటమే కాదు.. దాని ద్వారా వేలాది కోట్ల రూపాయిల్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు వెచ్చించటం మాత్రం వీరికే చెల్లుతుంది. బిల్ గేట్స్ కు 65 ఏళ్లు కాగా.. మెలిందాకు 56 ఏళ్లు.అన్యోన్యంగా ఉండే దంపతులుగా పేరున్న వీరు.. అకస్మాత్తుగా విడిపోతున్నట్లు ప్రకటించి షాకిచ్చారు. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్థరాత్రి తర్వాత ఈ నిర్ఱయాన్ని వారు ట్విటర్ ద్వారా ప్రకటించారు. ఎంతో మధనం తర్వాతే తామీ నిర్ణయానికి వచ్చినట్లుగా వారు పేర్కొన్నారు. గడిచిన 27 ఏళ్లలో తామిద్దరం ముగ్గురు పిల్లల్ని తీర్చిదిద్దామని.. ప్రపంచంలోని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా.. నిర్మాణాత్మకంగా ఎదిగేలా తమ ఫౌండేషన్ ను తీర్చిదిద్దినట్లు చెప్పారు.

దంపతులుగా విడిపోవచ్చు కానీ.. ధార్మిక కార్యక్రమాల్ని మాత్రం తమిద్దరి భాగస్వామ్యం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కొత్త ప్రపంచంలోకి వెళ్లేందుకు వీలుగా.. తమ వ్యక్తిగత ఆకాంక్షల్ని.. విడాకుల నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

బిల్ - మెలిందాలు ఇప్పటివరకు తమ ఫౌండేషన్ ద్వారా ఏకంగా 53 బిలియన్ డాలర్లను ధార్మిక కార్యక్రమాల కోసం వెచ్చించారు. మెక్రోసాఫ్ట్ కంపెనీని స్థాపించిన బిల్ గేట్స్.. తాను సీఈవోగా ఉన్నవేళలో మెలిందా ప్రొడక్ట్ మేనేజర్ గా చేరారు. 1994లో వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. తాజాగా వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. వీరి విడాకులకు కారణం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.