భారత్ భేష్: వ్యాక్సిన్ అభివృద్ధిపై బిల్‌గేట్స్ ప్రశంసలు

Thu Jul 16 2020 19:00:15 GMT+0530 (IST)

Bharat great: Bill Gates praises vaccine development

మహమ్మారి వైరస్‌కు విరుగుడు కనిపెట్టడంలో ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అన్ని దేశాలు తమ శక్తికి మించి ఆ వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో భారతదేశం ఆ వ్యాక్సిన్ కనిపెట్టడంలో ముందంజలో ఉంది. ఇప్పటికే కొన్ని వ్యాక్సిన్‌లు సిద్ధమయ్యాయి. వాటికి భారత ప్రభుత్వం కూడా అనమతి ఇచ్చింది. కాకపోతే ఇంకా ఆ మందులు ప్రయోగాల దశలో ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15వ తేదీలోపు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ వైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాలని భారత్ భావిస్తోంది. అందుకే చాలా రకాల మందులు సిద్ధమవుతున్నాయి. ఈ వైరస్ కట్టడి చర్యలు... బాధితులకు వైద్యం.. నివారణ చర్యలు వంటి వాటిపై భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా బిల్‌గేట్స్ భారతదేశంపై ప్రశంసలు కురిపించారు. మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారతదేశ ఫార్మా రంగాన్ని కీర్తించారు. అమెరికాకే కాక మొత్తం ప్రపంచానికి సరిపడా వ్యాక్సిన్‌లు ఉత్పత్తి చేయగల సత్తా భారత్‌కు ఉందని గుర్తుచేశారు. వ్యాక్సిన్ అభివృద్ధి కోసం భారత్‌లో ఇప్పటికే చాలా ముఖ్యమైన పరిశోధనలు జరిగాయని.. ఇతర వ్యాధుల కోసం ఉపయోగించిన పలు కాంబినేషన్‌లతో వైరస్‌కు వ్యాక్సిన్ రూపొందించడానికి భారత్ ఫార్మా కంపెనీలు కృషి చేస్తున్నాయని అభినందించారు.‘ఇండియాస్ వార్ ఎగెనెస్ట్ ది వైరస్’ అనే డాక్యుమెంటరీలో బిల్ గేట్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. డిస్కవరీ చానెల్ రూపొందించిన ఆ డాక్యుమెంటరీలో బిల్ గేట్స్ మాట్లాడుతూ.. వైరస్ ప్రభావం భారతదేశం మీద కూడా భారీగానే ఉందని తెలిపారు. జనాభా ఎక్కువ.. పట్టణ ప్రాంతాల్లో జనసాంద్రత అధికంగానే ఉంటుండడంతో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని వివరించారు. ఈ దేశంలో డ్రగ్ వ్యాక్సిన్ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయిని ఫార్మా కంపెనీలు ప్రపంచానికి అవసరమైన వ్యాక్సిన్‌లను భారీ మొత్తంలో ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తున్నాయని గుర్తించారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభమైన తర్వాత భారతదేశంలో ఉత్పత్తి అయినంత భారీగా వ్యాక్సిన్‌లు ప్రపంచంలో మరెక్కడా తయారు కాలేదని పేర్కొన్నారు. తన ప్రజలకే కాక మొత్తం ప్రపంచానికి సరిపడా వైరస్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం భారత్ సొంతమని తాను నమ్మకంగా చెప్పగలను అని బిల్ గేట్స్ తెలిపారు. ‘కొయిలేషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపరేడ్‌నెస్ ఇన్నోవేషన్స్’(సీఈపీఐ)లో భారతదేశం చేరడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌లు తయారు చేసే కంపెనీల కూటమి అనే విషయం తెలిసిందే.