అనుపమ పరమేశ్వరన్ బీహార్లో పరీక్ష రాస్తోందా?

Tue Jan 21 2020 19:43:00 GMT+0530 (IST)

Bihar board imprinted photo of South actress Anupama on student Hall Ticket

చదువు కొనసాగుతుండగా అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి.. రెండు పడవల ప్రయాణం చేసేవాళ్లు కొందరుంటారు. సినిమాల్లోకి వచ్చాక కూడా చదువు మీద ఆసక్తి కోల్పోకుండా మధ్య మధ్యలో పరీక్షలకు హాజరయ్యే ఆర్టిస్టులు కొంతమందిని చూశాం. కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ఫొటోతో ఉన్న ఒక ఎగ్జామ్ హాట్ టికెట్ చూస్తే ఆమె కూడా ఈ జాబితాలోనే చేరుతోందనిపిస్తుంది. కానీ అనుపమ ఫొటో పక్కన ఉన్న పేరు.. ఆమె పరీక్ష రాస్తున్న సెంటర్ చూస్తే మాత్రం కంగుతినడం ఖాయం. హాల్ టికెట్ మీదున్న పేరు రిషికేష్ కుమార్ కాగా.. బీహార్లో టీచర్ పోస్టు కోసం నిర్వహించే ఎస్ టెట్ ఎగ్జామ్ కోసం జారీ చేసిన హాల్ టికెట్ ఇది కావడమే ట్విస్టు. ఇదంతా బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు వారి ఘనకార్యం మరి.బీహార్ లో నిర్వహిస్తున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ హాల్ టికెట్లో ఓ యువకుడి ఫోటోకు బదులు అనుపమ ఫోటో రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మక్దుంపుర్లో నివశించే రిషికేశ్ కుమార్ టీచర్ పోస్ట్ కు అర్హత సాధించేందుకు ఎస్ టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నెల 28న జరిగే పరోక్ష కోసం ఆన్ లైన్ లో హాల్ టికెట్లు విడుదల చేసింది బోర్డు. తన అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ చేసి చూసుకున్న రిషికేశ్ షాక్ తిన్నాడు. అందులో వివరాలన్నీ తనవే అయినా.. ఫోటో మాత్రం సౌత్ ఇండియన్ అనుపమది ఉండటంతో వెంటనే అధికారులను సంప్రదించాడు. వాళ్లు తప్పును దిద్దుకునే లోపే విషయం బయటకు పొక్కి పరువు పోయింది. గతంలో ఒకసారి బీహార్ లో ఇలాగే ఓ ఇంజినీరింగ్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లో సన్నీలియోన్ ఫోటో రావడం కలకలం రేపింది.