Begin typing your search above and press return to search.

బిహార్ సంచలనం ఛాయ్ వాలీ.. టీ స్టాల్ ఎత్తేసిందే!

By:  Tupaki Desk   |   15 May 2022 4:02 AM GMT
బిహార్ సంచలనం ఛాయ్ వాలీ.. టీ స్టాల్ ఎత్తేసిందే!
X
అమితమైన వేగంతో మీడియా స్థానాన్ని ఆక్రమించేసిన సోషల్ మీడియా పుణ్యమా అని కొన్ని కోట్ల మంది తమ టాలెంట్ ను ప్రపంచానికి చూపుతున్న పరిస్థితి. పలువురు సక్సెస్ కావటమే కాదు సెలబ్రిటీలుగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ కోవలోకే వస్తారు బిహార్ కు చెందిన ఛాయ్ వాలీ ప్రియాంక. అదేంటి ఛాయ్ వాలా పేరు విన్నాం.. ఛాయ్ వాలీ పేరును వినలేదు కదా? అన్న డౌట్ వచ్చిందా? నిజానికి ఆ ప్రశ్నే ఆమె ఆస్తిత్వం. అదే ఆమెకు గుర్తింపును.. పేరు ప్రఖ్యాతుల్ని తీసుకొచ్చింది. అదే ప్రియాంక తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చింది. కారణం.. ఆమె తన టీ స్టాల్ ను మూసేయటమే ఇందుకు కారణం.

గల్లీ గల్లీకో ఛాయ్ వాలా కనిపిస్తారు. కానీ.. ఉన్నత చదువు చదివినప్పటికీ ఉద్యోగం రాకపోవటంతో ఖాళీగా ఉండటం ఇష్టం లేక.. ఛాయ్ దుకాణాన్ని ఓపెన్ చేయటం ద్వారా ఛాయ్ వాలీగా మరారు ప్రియాంక గుప్తా. బిహార్ రాజధాని పాట్నాలోని ఉమెన్స్ కాలేజీ వద్ద టీ స్టాల్ ఓపెన్ చేయటం ద్వారా ఆమె మీడియా.. సోషల్ మీడియా కంట్లో పడ్డారు. చాలా తక్కువ వ్యవధిలోనే ఆమెకు మంచి గుర్తింపు లభించింది.

ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ అయిన ఆమె.. తన చదువు పూర్తి చేసిన రెండేళ్లకు కూడా ఎలాంటి జాబ్ ను సంపాదించకపోవటంతో.. టీ స్టాల్ ఓపెన్ చేయాలని డిసైడ్ అయ్యారు. దీనికి ఆమె ఇంట్లోని వారి మద్దతు లభించింది. అలా టీ స్టాల్ స్టాల్ ను.. పాట్నా ఉమెన్స్ కాలేజీ దగ్గర ఓపెన్ చేశారు. ఈ 24 ఏళ్ల ఛాయ్ వాలీ వివరాలు మీడియాలోనూ.. సోషల్ మీడియాలో రావటంతో ఇ స్పెషల్ గా మారారు. దీంతో.. ఆమెకు పేరు ప్రఖ్యాతులతో పాటు.. పలువురు ఆమె నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.

తాజాగా ఆమె ఉదంతం ఒక పెద్ద మనిషిని కదిలించింది. ఆమెకు తన సహకారం అందిస్తానని చెప్పి.. టీ స్టాల్ స్థానే ఫుడ్ ట్రక్ ను ఇచ్చి అప్ గ్రేడ్ చేశారు. దీంతో.. ఆమె టీ స్టాల్ ఎత్తేసి.. ఫుడ్ ట్రక్ ను స్టార్ట్ చేశారు. తనతో పాటు మరికొందరు సిబ్బందితో ఫుడ్ ట్రక్ ను నిర్వహిస్తున్నారు. అనతి కాలంలోనే ఛాయ్ వాలీ కాస్తా..ఫుడ్ ట్రక్ నిర్వాహకురాలిగా అప్ గ్రేడ్ అయ్యారు. దీనంతటికి కారణం సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన కథనాలు వైరల్ కావటమేనని చెప్పక తప్పదు.