Begin typing your search above and press return to search.

బీహార్ ఎన్నికల్లో క్రిమినల్ కేసుల నిందితులే అభ్యర్థులు

By:  Tupaki Desk   |   26 Oct 2020 8:50 AM GMT
బీహార్ ఎన్నికల్లో క్రిమినల్ కేసుల నిందితులే అభ్యర్థులు
X
నేర చరిత్ర లేని నాయకులు ఎన్నికలలో పోటీ చేయడం, గెలుపొందడం వల్ల ప్రజలు కలలు కన్న సమాజ నిర్మాణానికి పునాదులు పడతాయి. కానీ నేడు ఎన్నికల ప్రక్రియపై డబ్బు, నేరగాళ్లు తీవ్ర దుష్ప్రభావం చూపుతున్నారు. నేరగాళ్లు ఎన్నికలలో పోటీ చేయడం వల్ల వారి ప్రభావం ఎన్నికలకే పరిమితం కావటం లేదు. పాలనపైనా పడుతోంది. రాజ్యాంగం ప్రజలందరికీ రాజకీయ న్యాయాన్ని ప్రసాదించింది. అయితే అలాంటి రాజకీయాల్లోకి నేరస్తులు ప్రవేశించడంతో, చేరటంతో ప్రజలకు సాంఘిక, ఆర్థిక న్యాయం జరగడం లేదు.

దేశంలో తాజా, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై మొత్తం 4,442 కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు సుప్రీంకోర్టు వివిధ హైకోర్టుల నుంచి అందిన నివేదికల్లో తెలిపింది. వీరిలో సిట్టింగ్ ప్రజాప్రతినిధులపై 2,556 కేసులు ఉన్నట్టు వెల్లడించింది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణను ఏడాదిలోపు పూర్తి చేయాలని 2015లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు ఇంకా అమలుకు నోచుకోవడం లేదు.

తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే బయటపడింది. బిహార్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరుగనున్నాయి. తొలి విడతలో ఓటింగ్ జరుగుతున్న నియోజకవర్గాల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో 31శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉండడం గమనార్హం.

బీహార్ ఎన్నికల్లో పోటీచేస్తున్న మొత్తం 1064మంది అభ్యర్థుల్లో 328మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొన్నారు. వారిలో ముగ్గురిపై రేప్ కేసులు.. 26మందిపై స్త్రీహింస కేసులు, 83మందిపై హత్య కేసులు, అటెంప్ట్ టు మర్డర్ కేసులు నమోదయ్యాయి.

ఇలా బీహార్ ఎన్నికల వేళ నేరచరితులు ఇంకా పోటీలోనే ఉన్నారు. నేర చరితులు ఎన్నికల్లో పోటీచేయకుండా సుప్రీం కోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. విచారణలు జరుగుతున్నాయి. ఇది ఎప్పుడు అమలవుతుందనేది వేచిచూడాలి.