Begin typing your search above and press return to search.

లాలూ ఓటు బ్యాంకుపై కన్ను.. వ్యూహం మార్చిన నితీశ్

By:  Tupaki Desk   |   20 Oct 2020 8:50 AM GMT
లాలూ ఓటు బ్యాంకుపై కన్ను.. వ్యూహం మార్చిన నితీశ్
X
ముచ్చటగా మూడోసారి బిహార్ కు ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని తపిస్తున్న బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. తన ఎన్నిక వ్యూహాన్ని మార్చారు. ఇప్పటివరకు అనుసరించిన ఫార్ములాకు భిన్నంగా తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో ఆయన కొత్త ఫార్ములాను సిద్ధం చేశారు. తన రాజకీయ ప్రత్యర్థి లాలూ పార్టీకి దెబ్బేసేలా ఆయన సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారు.

ప్రత్యర్థి పార్టీ అయిన ఆర్జేడీ బలమైన యాదవులు.. ముస్లింలకు ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా.. ఆయా వర్గాల వారికి భారీగా టికెట్లను కేటాయించటం ఆసక్తికరంగా మారింది. బీజేపీ మిత్రపక్షాలతో కలిపి పోటీ చేస్తున్న నితీశ్.. సీట్ల సర్దుబాటులో భాగంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జేడీయూ పార్టీ వాటాకు 115 స్థానాలు ఉన్నాయి. వీటిల్లో 30 స్థానాల్ని యాదవులకు.. ముస్లిం అభ్యర్థులకు కేటాయించటం ఆసక్తికరంగా మారింది. మొత్తం స్థానాల్లో దాదాపు పాతిక శాతం కంటే ఎక్కువగా కొత్త ఫార్ములాకు తగ్గట్లు అభ్యర్థులను బరిలోకి దింపటంతో.. తుది ఫలితం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

బిహార్ లో యాదవులకు.. ముస్లింలకు కలిపి మొత్తం 30 శాతం ఓట్ల వాటా ఉంది. దీనిలోని సింహభాగం ఆర్జేడీకి పట్టు ఉంది. ఆ పార్టీ పోటీ చేస్తున్న స్థానాల్లో 58 మంది యాదవులకు.. 17 మంది ముస్లిం అభ్యర్థులకు టికెట్లు కేటాయించారు. ఈ నేపథ్యంలో బిహార్ ఎన్నిక మరింత ఆసక్తికరంగా మారింది. అయితే.. బీజేపీతో చెట్టాపట్టాలు వేసుకున్న నితీశ్.. ముస్లిం అభ్యర్థులకు టికెట్లు ఇచ్చినంత మాత్రాన.. ఆయా వర్గాల వారు నితీశ్ కు ఓట్లు వేస్తారా? అన్నది ప్రశ్న. ప్రత్యర్థి ఓటు బ్యాంకును ఆకర్షించటానికి వేసిన ఎత్తుగడ సక్సెస్ అవుతుందా? దెబ్బ తీస్తుందా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి.. బిహార్ ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.