Begin typing your search above and press return to search.

బీహార్ ఓటర్లలో అయోమయం ?

By:  Tupaki Desk   |   14 Oct 2020 7:30 AM GMT
బీహార్ ఓటర్లలో అయోమయం ?
X
తొందరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లలో అయోమయం మొదలైపోయిందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే జరగబోయే ఎన్నికల్లో నాలుగు కూటములు, మూడు పార్టీలు విడిగా పోటీ చేస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. ప్రతికూటమిలోను కొద్దో గొప్పో పట్టున్న నాలుగైదు పార్టీలున్నాయి. ఇవి కాకుండా దేనికదే విడివిడిగా లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) శివసేన పోటీలో దిగుతున్నాయి. దాంతో ఒకవైపు కూటములు, మరోవైపు స్వతంత్రపార్టీలు రాజకీయ వేడిన పెంచేస్తున్నాయి.

నిజానికి మొన్నటి వరకూ అధికార ఎన్డీఏ కూటమికి మళ్ళీ తిరుగులేదని అనుకున్నారందరు. ఎందుకంటే ఎన్డీఏ కూటమికి జేడియూ అధినేత నితీష్ కుమార్ నేతృత్వం వహిస్తుండటమే ప్రధాన కారణం. గడచిన పదేళ్ళుగా సిఎంగా ఉన్న నితీష్ కు జనాల్లో పాజిటివ్ ఇమేజ్ ఉంది. దీనికి తోడు కేంద్రం మద్దతుండటం, మోడి, అమిత్ షా లు ప్రచారానికి వస్తుండటం కూడా తమకు కలిసి వచ్చేదే అని కూటమి అనుకున్నది. కూటమిలో మరో కీలకపార్టీ ఎల్జేపీ కూడా బలంగానే ఉంది కాబట్టి తమకు తిరుగులేదనుకున్నారు.

అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒక్కసారిగా ఎల్జేపీ షాక్ ఇచ్చింది. నితీష్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తు ఎన్డీఏ కూటమి నుండి ఎల్జేపీ బయటకు వచ్చేసి సొంతంగా పోటి చేస్తోంది. దీని ప్రభావం కూటమి గెలుపోటములపై పడటం ఖాయమైపోయింది. ఇదే సమయంలో ఆర్జేడీ నేతృత్వంలోని యూపీఏ కూటమిలో సీట్ల సర్దుబాటు సజావుగా అయిపోయింది. ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి బలహీనమైపోయిందని అనిపించిందో వెంటనే యూపీఏ కూటమి బలంగా అనిపిస్తోంది. ఈ కూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్ బలమైన పార్టీలే. అయితే సీట్ల సర్దుబాటులో తేడాలు రావటంతో కూటమి నుండి ఎన్సీపీ బయటకు వచ్చేసి విడిగా పోటీ చేస్తోంది.

ఈ రెండు కూటములు కాకుండా ప్రగతిశీల ప్రజాస్వామ్య కూటమి, మహా ప్రజాస్వామ్య లౌకిక కూటమి కూడా బరిలోకి దిగాయి. నిజానికి ఈ కూటములు బలంగా ఏమీ లేవు కానీ స్ధానికంగా కొన్ని ప్రాంతాల్లో మిగిలిన అభ్యర్ధుల గెలుపోటములను ప్రభావితం చేయగలవనే అనుకుంటున్నారు. ఇటువంటి పరిస్దితుల్లోనే సొంతంగా ఎల్జేపీ, ఎన్సీపీ, శివసేనలు తమ అభ్యర్ధులను రంగంలోకి దింపుతున్నాయి. దీంతో ఏ కూటములు, పార్టీల అభ్యర్ధులు ఎక్కువైపోవటంతో ఓటర్లలో ఒక్కసారిగా కన్ఫ్యూజన్ పెరిగిపోతున్నట్లుంది. అందుకనే సర్వేలు చేస్తున్నపుడు ఎవరికి ఓట్లేయాలో ఇంకా తేల్చుకోలేదని చెబుతున్నారట. పార్టీలు, కూటములు ఎక్కువయిపోతే కూడా నష్టమోనేమో.