Begin typing your search above and press return to search.

అతిపెద్ద భూకంపం.. చిగురుటాకులా వణికిపోయిన తుర్కియే..!

By:  Tupaki Desk   |   7 Feb 2023 9:58 AM GMT
అతిపెద్ద భూకంపం.. చిగురుటాకులా వణికిపోయిన తుర్కియే..!
X
తుర్కియో.. సిరియాలోని పలు ప్రాంతాల్లో గంటల వ్యవధిలో మూడు సార్లు తీవ్ర భూకంపాలు చోటుచేసుకున్నాయి. సోమవారం తెల్లవారుజామున అత్యంత తీవ్రమైన భూకంపంతో మొదలైన ప్రకంపనలు వరుసగా సంభవిస్తూ అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ఈ భూకంపాల ధాటికి పెద్దపెద్ద భవంతులు పేకమేడల్లా కూలిపోయాయి.

భూకంపం తెల్లవారుజామున రావడంతో నిద్రలోనే చాలా మంది మృత్యువాతపడ్డారు.ఇప్పటికే సుమారు 2300 మంది పైగా ప్రాణాలు కోల్పోగా క్షతగాత్రుల సంఖ్య భారీగా ఉంది. శిథిలాల కింద చిక్కుకుపోయిన వేలాది మందిని వెలికితీసే పనులు కొనసాగుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కన్పిస్తోంది.

గడిచిన 24గంటల్లో 50 వరకు స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు భూకంప అధ్యయన కేంద్రాలు పేర్కొన్నాయి. సోమవారం తెల్లవారుజామున 7.8 తీవ్రత తొలి భూకంపం సంభవించింది. తుర్కియోలోని గజియాన్ టెప్ కు సమీపంలో 17.9 కి.మీ లోతులో దీని కేంద్రం నమోదుకాగా నిమిషాల వ్యవధిలోనే 20సార్లు శక్తివంతమైన ప్రకంపనలు వచ్చినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది.

మధ్యాహ్నం 1.24 గంటల ప్రాంతంలో మరోసారి భూకంపం రాగా అది రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతను నమోదు చేసింది. ఆగ్నేయ తుర్కియేలోని ఎకినోజు ప్రాంతానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైంది. దీని ధాటికి సిరియా రాజధాని డమాస్కస్.. లటాకియా ప్రాంతాల్లో భూమి కంపించింది.

ఒకవైపు సహాయక చర్యలు కొనసాగుతుండగానే సాయంత్రం 6గంటల ప్రాంతంలో తుర్కియేలో 6.0 తీవ్రతతో మరోసారి భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. గంటల వ్యవధిలో మూడు భూకంపాలు సంభవించడంతో అపార ఆస్తినష్టం.. ప్రాణనష్టం సంభవించింది.

ఈ దుర్ఘటనపై తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్ విచారం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలోనే అత్యంత భారీ విపత్తు అని పేర్కొన్నారు. భూకంపం నేపథ్యంలో తుర్కియేలో ఎమర్జెన్సీని ప్రకటించారు. ఈ సంఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తుర్కియే భూకంప పరిస్థితిపై ఆ దేశ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ అర్డోన్ చేసిన ట్వీట్‌కు మోదీ స్పందించారు.

తుర్కియేలో భూకంపం కారణంగా ప్రాణ నష్టం.. ఆస్తి నష్టం జరగడం బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని.. భారత్ తుర్కియే ప్రజలకు అండగా నిలుస్తుందని.. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు మోదీ ట్వీట్ చేశారు.

తుర్కియే.. సిరియాలకు సాయం చేసేందుకు అమెరికా.. ఇజ్రాయిల్ ముందుకొచ్చాయి. మరోవైపు భారత్ విదేశాంగ సహాయ మంత్రి ఢిల్లీలోని తుర్కియే ఎంబీసీకి వెళ్లి పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ ఆ దేశ అధ్యక్షుడితో ఫోన్ మాట్లాడారు. తుర్కియే.. పాలస్తీనాలకు సాయం అందించేందుకు అన్నిదేశాలు ముందుకొస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.