Begin typing your search above and press return to search.

ఏపీ బీజేపీలో వ‌ర్గ పోరు.. పార్టీని న‌డిపిస్తోందెవ‌రు?

By:  Tupaki Desk   |   17 Jan 2022 2:51 AM GMT
ఏపీ బీజేపీలో వ‌ర్గ పోరు.. పార్టీని న‌డిపిస్తోందెవ‌రు?
X
ఏపీ బీజేపీలో వ‌ర్గ పోరు జోరందుకుంది. రెండు ర‌కాల నేత‌లు పార్టీలో ఆధిప‌త్యం కోసం పాకులాడుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. వీరిలో.. ఆర్ ఎస్ ఎస్ నుంచి వ‌చ్చి.. పార్టీలో చ‌క్రం తిప్పుతున్నవారు ఒక‌వ‌ర్గంగా ఉన్నారు. వీరు పార్టీకి శాశ్వ‌త‌మైన నాయ కులుగా పేరు తెచ్చుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు వ‌చ్చినా.. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా.. వీరు మాత్రం శాశ్వతంగానే ఉన్నారు. అంతేకాదు.. ప‌ద‌వులు ఆశించ‌కుండా కూడా ప‌నులు చేయ‌డం వీరికే సొంతం.

ఇక‌. మ‌రోవ‌ర్గం.. ఇటీవ‌ల కొన్ని పార్టీ ల నుంచి వ‌చ్చి చేరిన నేత‌లు. ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చి బీజేపీ తీర్థం పుచ్చుకున్న‌వారిలో దాదాపు రెండు మూడు పార్టీల నాయ‌కులు ఉన్నారు. వీరు అవ‌స‌రార్థం వ్య‌వ‌హ‌రించే నాయ‌కులని ఆర్ ఎస్ ఎస్ వాదులైన బీజేపీ నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు. ఎప్పుడు ఎలాంటి అవ‌స‌రం ఉన్నా.. వారు వెంట‌నే.. జంప్ చేస్తారని, ఎటు గాలివీస్తే.. అటు నాయ‌కుల ప‌య‌నం ఉంటుంద‌ని అంటున్నారు. దీంతో వీరి హ‌వా కొన‌సాగించ‌రాద‌నే ప‌ట్టుద‌ల‌తో ఒక వ‌ర్గం ఉంది.

కానీ.. పార్టీ అభివృద్ధి కోసం.. లేదా.. పార్టీని నిల‌బెట్ట‌డం కోసం. అధిష్టానం కొన్ని విష‌యాల్లో రాజీ ప‌డింది. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఆర్ ఎస్ ఎస్ వాదులైన బీజేపీ నేత‌లు ఒకింత దూకుడుగా ఉంటే.. పార్టీ బాగుండేద‌ని, మేం వ‌చ్చాకే పార్టీలో జోష్ వ‌చ్చింద‌ని జంపింగ్ నేత‌లు అంటున్నారు. క‌నీసం పార్టీ కోసం.. ముందుకు వ‌చ్చి మీడియాతో అయినా.. గ‌ళం వినిపించింది లేదని వారిపై విరుచుకుప‌డుతున్నారు. ఒక్క బ‌ద్వేల్ ఎన్నిక‌లో మాత్రం ఒకింత సాయం చేశార‌ని అనుకున్నా.. అది కూడా త‌మ త‌మ ప‌రిధిలోనే చేశార‌ని పార్టీలోనే గుస‌గుస వినిపిస్తోంది.

ఇక‌, అస‌లు నేత‌లు మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. కొన్ని సార్లు.. మౌనంగా ఉన్నా.. కీల‌క విష‌యాల్లో.. మాత్రం ఏపీ స‌ర్కారును వ్యూహాత్మ‌కంగా ఇరుకున నెట్టారు. అంత‌ర్వేది, రామ‌తీర్థం వంటి ఘ‌ట‌న‌లు విజ‌య‌వాడ దుర్గ‌మ్మ ఆల‌యానికి చెందిన వెండి సింహాలు మాయం.. ఇలా అనేక విస‌యాల్లో యాక్టివ్‌గానే ఉన్నా.. మ‌ధ్య‌లో కొంత మౌనంగా ఉండాల్సి వ‌చ్చింది. ఇక‌, ఇప్పుడు జంపింగ్ నేత‌లు.. మాత్రం రెచ్చి పోరుతున్నారు. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ప్ర‌భుత్వంపై పోరు చేస్తామ‌ని.. తేల్చి చెబుతున్నారు. మ‌రి దీనికి రీజ‌నేంటి? అంటే.. బీజేపీ నేత‌ల మ‌ధ్య క‌నిపిస్తున్న వ‌ర్గ విభ‌జ‌న రేఖేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పాత‌నీటి కంటే కూడా కొత్తనీటి ప్ర‌వాహానికి దూకుడు ఎక్కువ‌నే విష‌యాన్ని నిరూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీంతో బీజేపీలో వ‌ర్గ పోరు జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇలా అయితే.. పార్టీ విస్త‌రించేనా..? అధికారంలోకి వ‌చ్చేనా? అనేది ప్ర‌శ్న‌గా మారింది.