పంజాబ్ కింగ్స్ కి బిగ్ షాక్.. ఆస్పత్రిలో చేరిన ఆ జట్టు కెప్టెన్

Mon May 03 2021 10:00:01 GMT+0530 (IST)

Big shock to Punjab Kings .. The team captain who was admitted to the hospital

ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టుకు బిగ్ షాక్. ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరాడు. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం అధికారికంగా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.  శనివారం రాత్రి పంజాబ్ కింగ్స్  కెప్టెన్  కేఎల్ రాహుల్ తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండటంతో వెంటనే జట్టు  ఫిజియో అక్కడికి చేరుకొని ప్రాథమిక చికిత్స అందించారు. అయినప్పటికీ రాహుల్  కోలుకోలేదు. దీంతో వైద్యులు అతనికి పరీక్షలు నిర్వహించగా అతడు అపెండిసైటిస్ తో బాధపడుతున్నట్లుగా గుర్తించారు.అపెండిసైటిస్ బాధపడుతున్నవారికి 24 గంటల్లో సర్జరీ చేయాల్సిన అవసరం ఉండటంతో వెంటనే రాహుల్ ను ఆస్పత్రికి తరలించినట్లు జట్టు యాజమాన్యం ప్రకటించింది. ఆదివారం పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగగా రాహుల్ స్థానంలో మయాంక్ అగర్వాల్ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో మయాంక్ చెలరేగి ఆడాడు. సహచర ఆటగాళ్లు  వెంటవెంటనే వెనుదిరుగుతున్నా 99 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అయినప్పటికీ ఈ మ్యాచ్ లో పంజాబ్ కు  ఓటమి తప్పలేదు.

కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్ జట్టును కెప్టెన్ గా ముందుండి నడిపిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు రాహుల్ 7 మ్యాచ్ లు ఆడి 337 పరుగులు చేశాడు. అందులో నాలుగు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. పాయింట్ల పట్టికలో పంజాబ్ జట్టు ఆరో స్థానంలో ఉంది. రాహుల్ కు ఆపరేషన్ చేయాల్సి ఉండటంతో అతడు మళ్లీ బరిలోకి దిగుతా లేదా అనేది సందేహంగా మారింది. సీజన్  మొత్తానికి కూడా అతడు దూరం అయ్యే అవకాశం ఉంది. రాహుల్ లేని పంజాబ్ జట్టు ముందుకు వెళ్లడం కష్టమేనని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. రాహుల్ లేకుండానే ఆదివారం రాత్రి ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో   పంజాబ్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.