Begin typing your search above and press return to search.

‘టెస్లా’కు భారీ షాక్.. ఛాన్సే లేదన్న భారత్!

By:  Tupaki Desk   |   4 Aug 2021 1:30 AM GMT
‘టెస్లా’కు భారీ షాక్.. ఛాన్సే లేదన్న భారత్!
X
ఎల‌క్ట్రిక్ కార్ల దిగ్గ‌జం టెస్లా కంపెనీకి భారీ షాక్ త‌గిలింది. ఇండియాకు దిగుమ‌తి అయ్యే కార్లకు సంబంధించి దిగుమ‌తి సుంకం త‌గ్గించే ఆలోచ‌న ఏదీ లేద‌ని, అస‌లు అలాంటి ప్ర‌తిపాద‌నే లేద‌ని భార‌త్ స్ప‌ష్టం చేసింది. దీంతో.. టెస్లా కంపెనీ అధినేత ఎల‌న్ మ‌స్క్ కు ఎదురు దెబ్బ త‌గిలిన‌ట్లైంది. టెస్లా కంపెనీకి లేటెస్ట్‌మోడ‌ల్ ఎస్ ప్లెయిడ్ కార్ల‌ను భార‌త్ కు త‌ర‌లించాలంటే దిగుమ‌తి సుంకం భారీగా ప‌డుతోంద‌ని, అందువ‌ల్ల దాన్ని త‌గ్గించాల‌ని ఆ మ‌ధ్య టెస్లా కంపెనీ ప్ర‌భుత్వాన్ని కోరింది. దీనిపై ఇటీవ‌ల ఎల‌న్ మస్క్ ట్వీట్ కూడా చేశారు. కానీ.. అలాంటి ఛాన్స్ లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌క‌టించింది.

కాగా.. ఇత‌ర దేశాల్లో త‌యారైన‌ వ‌స్తువుల‌ను త‌మ దేశంలోకి అనుమ‌తివ్వ‌డానికి ఏ దేశ‌మైనా కొంత ప‌న్ను విధిస్తుంది. అది.. ఆయా దేశాల విధానాల‌ను బ‌ట్టి ఉంటుంది. మ‌న దేశంలో ల‌గ్జ‌రీ కార్ల‌కు సంబంధించి ప‌న్ను విధానం ఎలా ఉందంటే.. 40 వేల డాల‌ర్ల లోపు కారు ధ‌ర ఉంటే.. ఆ ధ‌ర‌లో 60 శాతాన్ని ప‌న్నుగా చెల్లించాల్సి ఉంటుంది. ఒక‌వేళ కారు ధ‌ర 40వేల డాల‌ర్ల‌కు పైన ఉంటే.. ఆ ధ‌ర‌కు స‌మానంగా (వంద శాతం) ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఈ దిగుమ‌తి సుంకమే చాలా ఎక్కువ‌గా ఉంద‌న్నారు మస్క్. భార‌త్ లో దిగుమ‌తి సుంకం మ‌రీ ఎక్కువ‌గా ఉంద‌ని, దాన్ని త‌గ్గిస్తే.. టెస్లా ఎస్‌ప్లెయిడ్ కార్ల‌ను భార‌త్ కు తీసుకొస్తామ‌ని టెస్లా అధినేత‌ మ‌స్క్ ఇటీవ‌ల‌ ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఇండియాకు తెస్తామ‌ని చెబుతున్న ఎస్ ప్లెయిడ్ కారు ధ‌ర‌.. భార‌త క‌రెన్సీలో కోటి రూపాయ‌ల‌కు పైమాటే. అంటే.. ప‌న్నుతో క‌లిసి రెండు కోట్ల‌పైగానే చెల్లించాల్సి ఉంద‌న్న‌మాట‌. దీన్ని తగ్గించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరింది టెస్లా.

తాము త‌యారు చేసే ఎల‌క్ట్రిక్ కార్ల‌ను ల‌గ్జ‌రీ కార్లుగా భావించొద్ద‌ని, కాలుష్యాన్ని త‌గ్గించి, ప‌ర్యావ‌ర‌ణానికి మేలు చేసే కారుగా గుర్తించి, ప‌న్ను త‌గ్గించాల‌ని కోరింది టెస్లా కంపెనీ. ఈ మేర‌కు గ‌తంలోనే అభ్య‌ర్థించింది. ఇటీవ‌ల‌ ఎల‌న్ మ‌స్క్ ట్వీట్ చేశారు. అయితే.. ఇండియాలో దిగుమ‌తి సుంకం ఎక్కువ‌గా ఉంద‌ని ట్వీట్ చేసిన నేప‌థ్యంలో.. కేంద్ర‌ ప్ర‌భుత్వ కీల‌క అధికారి ఒక‌రు కౌంట‌ర్ చేశారు. ‘‘మీ అభ్యర్థతను తప్పకుండా పరిశీలిస్తాం. అయితే.. ఇండియాలో టెస్లా కార్ల త‌యారీ యూనిట్ ను ఏర్పాటు చేస్తారా? ఇది జ‌రిగితేనే.. అది జ‌రుగుతుంది’’ అని కౌంటర్ ఇచ్చారు. దీంతో.. ఈ ట్వీట్ వైర‌ల్ అయ్యింది.

టెస్లా కంపెనీ జ‌ర్మనీ, చైనాలో కార్ల త‌యారీ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. అక్క‌డ త‌యారు చేసిన కార్ల‌ను భార‌త్ లో అమ్మ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. మ‌రి, ఆ కార్ల‌కు ఎందుకు ప‌న్ను త‌గ్గించాలి? అన్న‌ది ఒక వాద‌న‌. అందుకే.. ఇండియాలో ప్లాంటు ఏర్పాటు చేయాల‌నే డిమాండ్ మొద‌లైంది. ప్ర‌భుత్వ అధికారి కూడా త‌న ట్వీట్ ద్వారా ఇదే విష‌యాన్ని వెల్ల‌డించారు. కానీ.. మ‌స్క్ ఆ విష‌యానికి స్పందించ‌లేదు. ఇప్పుడు ప్ర‌భుత్వం మ‌స్క్ అభ్య‌ర్థ‌న‌ను తోసిపుచ్చ‌డం విశేషం. నిజానికి.. టెస్లా కార్ల‌కు ప‌న్ను త‌గ్గిస్తే.. ఇది ఈ ఒక్క కంపెనీతోనే ఆగిపోదు. రేప్పొద్దున మ‌రోకంపెనీ కూడా ఇలాంటి కోరికే కోరుతుంది. అలా త‌గ్గిస్తూ పోతే.. ఖజానాపై భారీ ఎఫెక్ట్ ప‌డుతుంది. బ‌హుశా.. కేంద్రం ఇదేవిధ‌మైన ఆలోచ‌న చేసి ఉండొచ్చ‌ని అంటున్నారు.