Begin typing your search above and press return to search.

ఆరెస్సెస్ ఎంట్రీతో ఏపీ పాలిటిక్స్ లో బిగ్ చేంజి....?

By:  Tupaki Desk   |   29 Jan 2023 1:00 PM GMT
ఆరెస్సెస్ ఎంట్రీతో ఏపీ పాలిటిక్స్ లో బిగ్ చేంజి....?
X
బీజేపీ సైద్ధాంతిక స్వరూపంగా ఆరెస్సెస్ ని చూస్తారు. ఆరెస్సెస్ రాజకీయ ముఖం బీజేపీ అంటారు. అయితే సామాజిక సేవా కార్యక్రమాలలో ఆరెస్సెస్ ఉంటుంది. కానీ ఎన్నికల వేళ బీజేపీకి సహకరిస్తుంది. అలాగే క్లిష్టమైన సమయాల్లో సలహా సూచనలు ఇస్తుంది. అలా దేశంలో ఆరెస్సెస్ భావజాలం ఉన్న పాఋటీలతో బీజేపీకి పొత్తు కుదురుస్తుంది. అలాగే హిందూత్వ వాదన మొగ్గు తగ్గకుండా చూసుకుంటుంది.

అలాంటి ఆరెస్సెస్ ప్రస్తుతం ఏపీ బీజేపీ రాజకీయాల మీద ఫుల్ ఫోకస్ పెట్టిందని అంటున్నారు. ఏపీ బీజేపీ బిగ్ షాట్, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీని వీడుతారు అని డేట్ టైం ఫిక్స్ చేసుకున్న వేళ ఆయన ఆలోచనలకు బ్రేకు వేసేలా చేసింది ఆరెస్సెస్. మరి ఆయనకు ఏమి హామీ దక్కింది అన్నది కనుక చూస్తే ఏపీ రాజకీయాల్లో ఇక మీదట చాలా కీలకమైన మలుపులు ఉంటాయని అంటున్నారు.

ఆరెస్సెస్ తరఫున బీజేపీ వ్యవహారాలు అన్నీ చూస్తే శివ ప్రకాష్ జీ తో కన్నా లక్ష్మీనారాయణ రెండు గంటల పాటు సమావేశం అయ్యారు. అంతే ఆయన గొంతు పూర్తిగా మారిపోయింది. తాను బీజేపీని వీడి వెళ్లడం లేదు అని స్పష్టం చేశారు. అంతే కాదు తాను పార్టీకి బద్ధుడిని అని చెప్పుకున్నారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్ తో సమావేశం అన్నది ఒక స్నేహితుడిగా భేటీ తప్ప రాజకీయ అంశాలు లేవు అని చెప్పుకున్నారు.

అంటే కన్నా బీజేపీలో కొనసాగుతారు అన్న మాట. మరి ఆయన అలా మనసు మార్చుకునేలా శివ ప్రకాష్ జీ ఏ మంత్రం వేశారు అన్నదే ఇపుడు చర్చగా ఉంది. ఆయనకు కన్నా అన్ని విషయాలు వివరించారని అంటున్నారు. ఏపీలో రాజకీయాల గురించి, అలాగే బీజేపీలో వర్గ పోరు గురించి చెప్పారని అంటున్నారు. అదే విధంగా ఏపీలో వైసీపీ హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని చెప్పారని అంటున్నారు.

ఇక బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే సీటూ ఓట్లూ రావని పొత్తులు పెట్టుకోవాల్సిందే అని కన్నా వివరించారని అంటున్నారు. పార్టీలో నాయకులు అంతా ఒంటరి పోరుకు తట్టుకోలేరని తేటతెల్లం చేశారని తెలుస్తోంది. ఏపీలో 2014 నాటి పొత్తులను రిపీట్ చేయడం మంచిదని కన్నా చెప్పిన దానికి శివ ప్రకాష్ జీ సాంతం విన్నారని అంటున్నారు. ఆయన కేంద్ర బీజేపీ పెద్దలను కలసి ఏపీ బీజేపీ పరిష్తితుల మీద పూర్తి నివేదిక ఇస్తారని అంటున్నారు.

ఏపీలో హిందూత్వ విధానాలు సాఫీగా సాగాలీ అంటే వైసీపీ గద్దె దిగాలన్నది ఆరెస్సెస్ ఆలోచనగా చెబుతున్నారు. ఇక ఏపీలో తెలుగుదేశం జనసేనలతో కలసి బీజేపీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం కూడా ఆరెస్సెస్ కేంద్ర పెద్దల ముందు ఉంచే ప్రతిపాదన అవుతుందని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయని అంటున్నారు. కన్నాకు బీజేపీలో ప్రాధాన్యత పెంచుతారని తెలుస్తోంది. ఆరెస్సెస్ జోక్యంతోనే 2014లో తెలుగుదేశంతో బీజేపీ పొత్తు సాధ్యమైంది. మళ్లీ ఆరెస్సెస్ రంగంలోకి దిగుతోంది అంటే అది వైసీపీకి ఇబ్బందేనా అంటే చూడాలి మరి.