Begin typing your search above and press return to search.

క‌మ‌ల్ హాస‌న్ కు పెను స‌వాల్‌!

By:  Tupaki Desk   |   7 May 2021 9:30 AM GMT
క‌మ‌ల్ హాస‌న్ కు పెను స‌వాల్‌!
X
నిన్న‌టి త‌రంలో ఒక సైద్ధాంతిక ప‌రంగా రాజ‌కీయాలు ముందుకు సాగేవి. గెలుపు ఓట‌ముల‌తో సంబంధం లేకుండా.. న‌మ్మిన సిద్ధాంతం కోసం క‌డ‌వ‌ర‌కు నిల‌బ‌డేవారు రాజ‌కీయ నాయ‌కులు. కానీ.. ఇప్పుడు ప‌రిస్థితి అది కాదు. అధికారం ఉన్న‌చోట ఈగ‌లు ముసిరిన‌ట్టుగా చేరుతున్నారు. రేపు అధికారంలోకి వ‌స్తుంద‌నే ఆశ‌ ఉన్నచోట విప‌క్షంలోనూ కొన‌సాగుతున్నారు. కానీ.. రేప‌టిపై భ‌రోసా లేని చోట.. ఎన్నిక‌ల ఆట ముగియ‌గానే పెట్టేబేడా స‌ర్దేస్తున్నారు.

త‌మిళ‌నాట ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డి నాలుగు రోజులు కాలేదు. అప్పుడే.. క‌మ‌ల్ పార్టీలోని గోడ‌మీది పిల్లుల‌న్నీ దూకేస్తున్నాయి. మ‌క్క‌ల్ నీది మ‌య్యం పార్టీ 150 సీట్ల‌లో పోటీచేస్తే.. ఒక్క చోట‌కూడా గెలవ‌లేదు. చివ‌ర‌కు అధినేత క‌మ‌ల్ కూడా ఓట‌మిపాల‌య్యారు. దీంతో.. ఈ పార్టీలో ఉండి లాభం లేద‌ని భావిస్తున్న వారంతా జారుకుంటున్నారు. ఇప్ప‌టికే అర‌డ‌జ‌ను మంది నేత‌ల వ‌ర‌కూ వెళ్లిపోవ‌డం గ‌మ‌నార్హం.

పార్టీలో కీల‌క నేత‌లుగా ఉన్న ఏజీ మౌర్య‌, మురుగ‌నంద‌న్, సీకే.కుమరావెల్‌, ఉమాదేవీ వెళ్లిపోయిన‌ట్టు మ‌క్క‌ల్ నీది మ‌య్యం పార్టీ అధికారికంగా వెల్ల‌డించింది. తాజాగా.. ఎంఎన్ఎం ఉపాధ్య‌క్షుడు మ‌హేంద్ర‌న్ కూడా త‌ట్టాబుట్టా స‌ర్దేసుకున్నారు. అయితే.. ఆయ‌న పోతూ పోతూ క‌మ‌ల్ పై నాలుగు రాళ్లు విసిరేసి పోవ‌డం గ‌మ‌నార్హం.

క‌మ‌ల్ కు పార్టీని న‌డిపే విధానం తెలియ‌ద‌ని, పార్టీలో ప్ర‌జాస్వామ్యం లేద‌ని విమ‌ర్శ‌లు గుప్పించి వెళ్లిపోయారట‌. దీనిపై క‌మ‌ల్ ఘాటుగా స్పందించిన‌ట్టు స‌మాచారం. మ‌హేంద్ర‌న్ ఓ క‌లుపు మొక్క‌గా అభివ‌ర్ణించిన క‌మ‌ల్‌.. ఆయ‌న వెళ్ల‌కపోతే తామే వెళ్ల‌గొట్టేవాళ్ల‌మ‌ని మండిప‌డ్డార‌ట‌.

ఈ విమ‌ర్శ‌ల సంగ‌తి ఎలా ఉన్నా.. ఒక్క సీటూ గెల‌వ‌క‌పోవ‌డం అనేది శ్రేణుల‌కు నిరాశ క‌లిగించే అంశ‌మే. ఇలాంటి స‌మ‌యంలో పెళుసులు ఊడిపోయిన‌ట్టుగా కొంద‌రు జారిపోవ‌డం కూడా కామ‌నే. అయితే.. ఈ ప‌రిస్థితిని ఎదుర్కొని పార్టీని ముందుకు తీసుకెళ్లడంపైనే రాజ‌కీయ భ‌విష్య‌త్ ఆధార‌ప‌డి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో క‌మ‌ల్ కు క‌ఠిన స‌వాళ్లు ఎదురు కానున్నాయి. ఎందుకంటే.. ఎన్నిక‌లు రావ‌డానికి ఐదేళ్ల స‌మ‌యం ఉంది మ‌రి. అప్ప‌టి వ‌ర‌కు నేత‌ల‌ను కాపాడుకుంటూ.. క్యాడ‌ర్ ను నిల‌బెట్టుకోవ‌డం ఖ‌చ్చితంగా పెను స‌వాలే!