పడిపోయిన రిటైల్ విక్రయాలు.. సంక్షోభంలో సంస్థలు

Sat Mar 28 2020 22:00:01 GMT+0530 (IST)

Big Trouble For Retailers

దేశంలో కరోనా విలయతాండవం చేస్తుండగా మార్కెట్లకు మాత్రం కోలుకోలేని దెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో ప్రస్తుతం చిల్లర వర్తకం మినహా వ్యాపారాలన్నీ కుదేలయ్యాయి. దీని ప్రభావం ముఖ్యంగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్పై తీవ్రంగా పడింది. ప్రస్తుతం షాపింగ్ మాల్స్ అన్నీ మూసివేశారు. దుకాణదారులందరూ ఇంటికే పరిమితమయ్యారు. అనేక వ్యాపార సంస్థలు క్షీణించాయి. షాపింగ్ మాల్స్ రిటైల్ దుకాణాలు మూసివేయడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. లాక్డౌన్ పరిస్థితులతో వారికి చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. అయితే దీని ప్రభావంతో ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. దాదాపు లక్షల మంది ఉపాధి కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిణామంపై రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ సంస్థ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తమ వ్యాపారంపై ఓ నివేదిక రూపొందించింది.దీని ప్రకారం ఫిబ్రవరి చివరి నాటికి తమ వ్యాపారాలు 20-25 శాతం పడిపోయాయని గుర్తించారు. ప్రస్తుతం విధించిన లాక్డౌన్తో మరింత క్షీణించే ప్రమాదం ఉందని ఆంఓదళన వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో 15 లక్షలకు పైగా ఉన్న ఆధునిక రిటైల్ దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా రూ.4.74 లక్షల కోట్ల విలువైన వ్యాపారం జరుగుతోందని అంచనా. వీటిలో దాదాపు 60 లక్షల మంది దాక ఉద్యోగులు ఉన్నారు. అయితే కరోనా వైరస్ భారత్లో అడుగుపెట్టడంతో నెలన్నర రోజుల్లో ఈ వ్యాపారంపై తీవ్రంగా ప్రభావం చూపింది. ఏకంగా 15 శాతం మేర వ్యాపారాలు తగ్గాయి. నిత్యావసర వస్తువులకు మాత్రమే ఈ సమయంలో మినహాయింపు ఇవ్వడంతో ఇతర సాధారణ సరుకులను విక్రయించడానికి అనుమతి లేదు. దీంతో ఈ రిటైల్ దుకాణదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా దుస్తులు ఆభరణాలు బూట్లు ఎలక్ట్రానిక్స్ డ్యూరబుల్స్ ఐటీ సెల్ఫోన్లు తదితర రిటైల్ విక్రయాలపై గణనీయమైన ప్రభావం చూపింది.

అయితే ఈ లాక్డౌన్ మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. దీంతో వ్యాపారాలు కొనసాగక 30 శాతం మేర రిటైల్ దుకాణాలను మూసివేసే పరిస్థితి వస్తోందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అదే గనుక జరిగితే 18 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చెబుతోంది. ఇటీవల పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన మాదిరి రిటైల్ పరిశ్రమకు కూడా ప్యాకేజీ కల్పించాలనే డిమాండ్ పెరుగుతోంది. దీనిపై కొందరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారంట. ఇన్ని ఇబ్బందుల మధ్య తమ వ్యాపారం కొనసాగడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని వ్యాపారులతో పాటు ఉద్యోగులు కోరుతున్నారు.