Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. 12 మంది ఎమ్మెల్యేలు జంప్

By:  Tupaki Desk   |   25 Nov 2021 5:33 AM GMT
ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. 12 మంది ఎమ్మెల్యేలు జంప్
X
మేఘాలయ కాంగ్రెస్‌ పార్టీలో కీలక పరిణామం. అక్కడ కాంగ్రెస్ కి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మాజీ సీఎం ముకుల్‌ సంగ్మా తన మద్దతుదారులైన 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి తృణమూల్‌ కాంగ్రెస్‌ లో చేరారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్‌ మెత్బా లింగ్డోకు తిరుగబాటు ఎమ్మెల్యేలు ఇప్పటికే లేఖ రాశారు. కాంగ్రెస్‌ కు చెందిన 17 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది తమ పార్టీలో చేరినట్లు టీఎంసీ ప్రకటించింది. దీంతో మెఘాలయా అసెంబ్లీలో టీఎంసీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది.

ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేయాలని చూస్తున్న టీఎంసీ.. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలను తనకు అనుకూలంగా మలచుకుంటున్నది. 2023లో జరగనున్న ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలనే దిశగా టీఎంసీ అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ బృందం వివిధ పార్టీల నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నదని సమాచారం. ఇందులో భాగంగానే సంగ్మా తన అనుచరులతో కలిసి టీఎంసీలో చేరినట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి.

శాసనసభలో ప్రతిపక్షనేత అయిన ముకుల్‌ సంగ్మా, కాంగ్రెస్‌ అగ్రనాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు విన్సెంట్‌ హెచ్‌ పాలాతో ఆయనకు పొసగడం లేదు. అయితే పార్టీ పెద్దల సూచనతో వారిరువురు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఇంతలోనే సంగ్మా, పార్టీని కుదిపేశారు. కాగా, జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చిన మమతా బెనర్జీ, వివిధ పార్టీల నాయకులను కలవడానికి ఢిల్లీకి వెళ్లారు. ఇదే సమయంలో మేఘాలయలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీని ఆమె నేతృత్వంలోని టీఎంసీ చీల్చడం గమనార్హం.