టీడీపీ కి బిగ్ రిలీఫ్ ... సభకి హాజరైన గంటా వాసుపల్లి !

Mon Jan 20 2020 16:05:06 GMT+0530 (IST)

Big Relief to TDP

రాష్ట్ర రాజధాని ని అమరావతి నుండి తరలించబోతున్నారు అనే ఆందోళనతో ఉన్న టీడీపీకి విశాఖ ఎమ్మెల్యేలు కొంచెం రిలీఫ్ ఇచ్చారు. 2019 లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుండి కేవలం 23 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఆ ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీకి దగ్గరయ్యారు. వారే వల్లభనేని వంశీ..మద్దాలి గిరి. అయితే గత కొన్ని రోజులుగా ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం రచ్చ రచ్చ చేస్తుంది. అమరావతి తరలింపును అడ్డుకుంటామని చెబుతున్న టీడీపీ ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలని పార్టీ నిర్ణయానికి మద్దతుగా ఓటింగ్ చేయాలంటూ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లకి విప్ జారీ చేసింది.అయితే ఆదివారం జరిగిన టీడీపీ శాసనసభా పక్ష సమావేశానికి అయిదుగురు ఎమ్మెల్యేలు.. 12 మంది ఎమ్మెల్సీలు గైర్హాజరయ్యారు. దీంతో టీడీపీలో టెన్షన్ కనిపించింది. కానీ వారందరు కూడా టీడీపీ తోనే ఉన్నారు అంటూ కొందరు చెప్పుకోచ్చారు. అయితే ఎట్టకేలకు టీడీఎల్పీ సమావేశానికి హాజరు కాని ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సభకు మాత్రం హాజరయ్యారు. తాము..పార్టీ సమావేశానికి హాజరు కావటం లేదని..అసెంబ్లీకి వస్తామంటూ సమాచారం ఇచ్చినట్లుగా చెప్పుకొచ్చారు. అయినా వారు సభకు వచ్చే వరకూ టీడీపీలో వారి పైనే చర్చ సాగింది. కానీ వారిద్దరూ సభకు హాజరవ్వటంతో పాటుగా టీడీపీ బెంచ్ ల్లోనే కూర్చుకున్నారు. కానీ వారు సభలో ఒక వేళ రాజధానుల నిర్ణయం పైన డివిజన్ అవసరమైతే..విప్ కు కట్టుబడి ఉంటారా..లేక తమ ప్రాంతానికి పరిపాలనా రాజధాని కోసం నిలబడతారా అనే చర్చ జరుగుతుంది. అయితే గంటా..వాసుపల్లి గణేష్ లాంటి వారు వైసీపీ మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించారు.

టీడీపీ నుండి ఎమ్మెల్యేలుగా గెలిచి వైసీపీకి దగ్గరైన వల్లభనేని వంశీ..మద్దాలి గిరి కి సైతం టీడీపీ విప్ జారీ చేసింది. వంశీ సభలో తనకు టీడీపీతో సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్ధిగా పరిగణించాలని కోరారు. దీనికి స్పీకర్ సైతం సమ్మతించారు. టీడీపీ వంశీని సస్పెండ్ చేసింది. కానీ నిబందనల ప్రకారం ఆయన టీడీపీ సభ్యుడుగానే ఉంటారని పార్టీ విప్ పరిధిలోనే ఉంటారని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అసెంబ్లీ రికార్డుల ప్రకారం వంశీ ఇంకా టీడీపీ సభ్యుడు గానే ఉన్నారు. ఇక మద్దాలి గిరి సైతం టీడీపీ సభ్యుడు గానే ఉన్నారు. వారిద్దరూ సభకు హాజరైనా సభ లోపలకు మాత్రం రాలేదని తెలుస్తోంది. ఇక టీడీఎల్పీ సమావేశానికి హాజరు కాని 12 మంది ఎమ్మెల్సీల విషయం మంగళవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.