Begin typing your search above and press return to search.

గ్రేటర్ ఎన్నికల్ని దెబ్బేయనున్న ‘వర్షం’.. నిజమెంత?

By:  Tupaki Desk   |   17 Oct 2020 3:30 AM GMT
గ్రేటర్ ఎన్నికల్ని దెబ్బేయనున్న ‘వర్షం’.. నిజమెంత?
X
రాజకీయాలు అంతే. అప్పటివరకు తిరుగులేని అధికారం ఉన్నట్లు ఉంటుంది. కానీ.. ఒక్క ఘటన చాలు మొత్తం బొమ్మ మారిపోవటానికి. ఇప్పుడు అలాంటి పరిస్థితే తెలంగాణలో నెలకొని ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థలకు జిరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 90 శాతానికి పైగా ఓట్లతో కవిత ఘన విజయం సాధించిన వేళ.. గులాబీ దళంలో పొంగిపొర్లిన ఉత్సాహం.. సరిగ్గా రెండు రోజులకు నీరు కారిపోయింది. అప్పటివరకు కనిపించిన ధీమా.. సానుకూల వాతావరణం మొత్తం ఒక్క వర్షానికి కొట్టుకుపోయింది.

వర్షం.. ఆపైన వరద పోటు తెలంగాణ వ్యాప్తంగా ఎలా ఉన్నా.. హైదరాబాద్ మహానగరానికి చేసిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు. మహానగర ప్రజల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు నేరుగా ప్రభావితమైతే.. ప్రతి ఒక్కరు పరోక్షంగా ప్రభావితం కావటాన్ని మర్చిపోకూడదు. ఇంతకాలం భారీ వర్షాలు.. వరదలు అన్నప్పుడు మురికివాడలు.. నాలాల పక్కన ఉండేవారు.. చెరువులకు దగ్గరగా ఉండే కట్టడాలు..కాలనీలు.. బస్తీలు మాత్రమే ప్రభావితమయ్యేవి.

అందుకు భిన్నంగా ఈసారి మాత్రం పెద్ద పెద్ద విల్లాలు.. భారీ ప్రాజెక్టులు సైతం ప్రభావితం కావటం తెలంగాణ అధికారపక్షానికి ఇబ్బందికరంగా మారింది. భారీ వర్షాల వేళ సాగిన సహాయకచర్యలు అంతంత మాత్రంగా సాగినట్లుగా ప్రజలు ఆరోపిస్తున్నారు. నిజానికి తన సామర్థ్యానికి తగ్గట్లు విద్యుత్ సిబ్బంది పని చేస్తే.. వరద నీటి కారణంగా చాలా కాలనీల్లో విద్యుత్ ను 48 గంటల తర్వాతే ఇచ్చారు. దీంతో పాటు.. కాలనీల్లో వరదనీరు నిలిచిపోవటం.. ముందుకు పోయే అవకాశం లేకపోవటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

తమకు ఎదురైన కష్టాన్ని.. అలీబాబా అద్భుత దీపంతో ఇట్టే మార్చేసేలా.. తాము ఎన్నుకున్న కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తుందని భావించిన వారంతా అవాక్కు కావటమే కాదు.. మరీ ఇంత దారుణమైన స్పందనా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. బడుగు బలహీన వర్గాలకు ఇలాంటి కష్టాలు.. వాటిని తీర్చే విషయంలో అధికారులు.. ప్రభుత్వ యంత్రాంగం నిర్లిప్తంగా ఉండటం అలవాటే. అందుకు భిన్నంగా ఎగువ మధ్యతరగతి.. సంపన్న వర్గాలకు మాత్రం మింగుడుపడనివి. అదే ఇప్పుడు కేసీఆర్ సర్కారుకు నెగిటివ్ అయ్యే పరిస్థితి.

మొన్నటివరకు గులాబీ దళానికి తిరుగులేదన్నట్లుగా జరిగిన ప్రచారానికి భిన్నమైన పరిస్థితులు గడిచిన నాలుగు రోజుల్లో చోటుచేసుకున్నాయని చెబుతున్నారు. మొన్నటివరకు ఉన్న సానుకూలత ఇప్పుడు లేదంటున్నారు. మొన్నటివరకు కమలనాథుల్ని లైట్ తీసుకున్న గులాబీ నేతలు.. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదంటున్నారు. గుర్రం ఎగరావచ్చన్నట్లుగా వారి మాటలు ఉండటం గమనార్హం.

వేగంగా మారిపోతున్న పరిణామాలు.. కేసీఆర్ సర్కారుకు మింగుడుపడటం లేదంటున్నారు. ఓవైపు వర్షం.. వరద కారణంగా ఎదురైన డ్యామేజీని కంట్రోల్ చేయటం మీదనే ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన పరిస్థితి. దీంతో.. గతంలో మాదిరి దుబ్బాక మీద ఎక్కువ శ్రద్ధ చూపలేకపోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి తోడు.. గులాబీ దళంలో చోటు చేసుకున్న మితిమీరిన ఆత్మవిశ్వాసం కూడా దుబ్బాక ఫలితం మీద నెగిటివ్ ప్రభావానికి కారణం కావొచ్చంటున్నారు.

ఒకవేళ దుబ్బాకలో లెక్క తేడా వస్తే.. దాని ప్రభావం గ్రేటర్ మీద ఉంటుందంటున్నారు. అదే జరిగితే.. ఇప్పటి మాదిరి డిసెంబరు చివరి వారం లేదంటే.. జనవరి మొదటి వారంలో జరగాల్సిన గ్రేటర్ ఎన్నికలు మరికాస్త ముందుకు నెట్టే అవకాశం ఉందంటున్నారు. అందుకు తగ్గట్లుగా లోగుట్టు కసరత్తు జరుగుతుందన్న మాట వినిపిస్తోంది. మరి.. తమకు వచ్చిన సానుకూల వాతావరణాన్ని విపక్షం ఏ మేరకు ఉపయోగించుకుంటుందో చూడాలి.