మనోడికి అదిరే పదవి.. అమెరికా అధ్యక్షులు ఎవరూ చేయనిది చేసిన బైడెన్

Sun Aug 01 2021 10:27:55 GMT+0530 (IST)

Biden opens a new tradition

అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్.. తాజాగా తీసుకున్న నిర్ణయం.. ఆయన్ను మిగిలిన వారికి భిన్నంగా నిలిపింది. ఇప్పటివరకు అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న ఏ దేశాధినేత తీసుకోని రీతిలో ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. తాను అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన నాటి నుంచి.. వివిధ పదవుల్లో భారత మూలాలు ఉన్న వారిని.. ప్రవాస భారతీయుల్ని.. భారతీయ అమెరికన్లకు కీలక పదవులు కట్టబెట్టిన వైనం తెలిసిందే. ఎవరిదాకనో ఎందుకు..  ఆయనకు అత్యంత సన్నిహితురాలైన కమలా హారీస్ ను ఏకంగా ఉపాధ్యక్ష పదవికి నిలిపిన సంగతి తెలిసిందే.అలాంటి బైడెన్ తాజాగా మరో భారతీయ అమెరికన్ కు కీలక పదవికి నామినేట్ చేశారు. ఈ పదవి అంతర్జాతీయంగా ఎంతో కీలకం. అలాంటి పదవిని ఆయన అనూహ్య రీతిలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేయటమే కాదు.. చర్చగా మారింది. అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛకు సంబంధించి అంబాసిడర్ - ఎల్ - లార్జ్ పదవికి 41 ఏళ్ల రషద్ హుస్సేన్ ను ఎంపిక చేసింది.

ఈ పదవి ప్రత్యేకత ఏమంటే.. ఈ పదవిలో ఉన్న వారు అమెరికా తరఫున ఒక దేశానికే రాయబారిగా ఉండరు. పలు దేశాల్లో.. వేర్వేరు బాధ్యతల్లో రాయబారిగా.. అవసరమైతే మంత్రిగా కూడా వ్యవహరిస్తారు. అంతర్జాతీయంగా పలు కీలక భేటీల్లో ఆయన పాల్గొనాల్సి వస్తుంది. ఐక్య రాజ్యసమితి.. యూరోపియన్ యూనియన్ లలో కూడా అమెరికా తరఫున ఆయన పాల్గొనాల్సి ఉంటుంది. అలాంటి ఒక ఉన్నత పదవిని భారతీయ అమెరికన్ కమ్ ఒక ముస్లింకు కేటాయించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈ పదవికి ఒక ముస్లింను కేటాయించటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. కీలక పదవుల్ని చేపట్టటం రషద్ హుస్సేన్ కు కొత్తేం కాదు. గతంలో అతడు ఒబామా అధ్యక్షుడిగా ఉన్న వేళలో ఇస్లామిక్ కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ లో అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా.. వ్యూహాత్మక ఉగ్ర వ్యతిరేక విభాగం ప్రత్యేక ప్రతినిధిగా.. వైట్ హౌస్ టీంలో డిప్యూటీ అసోసియేట్ గా పలు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం అమెరికా జాతీయ భద్రతా మండలిలో గ్లోబల్ ఎంగేజ్ మెంట్ విభాగం డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. మొత్తంగా తన తాజా నియామకంతో బైడెన్ తన మార్కును చూపించారనే చెప్పాలి.