Begin typing your search above and press return to search.

కరోనాకు విరుగుడు..హైదరాబాద్‌ లో వ్యాక్సిన్‌ తయారీ

By:  Tupaki Desk   |   4 April 2020 7:15 AM GMT
కరోనాకు విరుగుడు..హైదరాబాద్‌ లో వ్యాక్సిన్‌ తయారీ
X
చైనాలో పుట్టి ఆ దేశాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌ ఇప్పుడు ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టింది. ఆ వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుండడంతో పాటు ఆ వైరస్‌ కు నివారణ మందు లేకపోవడంతోనే ఆ వైరస్‌ ఇంత తీవ్రంగా వ్యాపించడానికి కారణం. ముందు ఆ వైరస్‌ చైనాలో కనిపించినప్పుడు ప్రపంచ దేశాలు పట్టించుకోలేదు. ఆ వైరస్‌ తీవ్రవతను ప్రపంచ దేశాలు అంచనా వేయలేకపోయాయి. ఆ వైరస్‌ పై అప్రమత్తంగా లేకపోవడంతో కరోనా వైరస్‌ అన్ని దేశాల్లోకి అడుగుపెట్టి ఇప్పుడు విశ్వరూపం చూపిస్తోంది. దీని దెబ్బకు మానవాళి ప్రపంచం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఆ కరోనాతో సతమతమవుతూనే ఆ వైరస్‌కు విరుగుడు కనిపెట్టేందుకు పలు దేశాలు ముందుకు వస్తున్నాయి. కరోనాకు విరుగుడు కనిపెట్టి ఆ వైరస్‌ ను కానరాకుండా చేయాలని వైద్య పరిశోధన సంస్థలు - ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు - వివిధ విశ్వవిద్యాలయాలు - వైద్య కళాశాలలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలోని హైదరాబాద్‌ లో కూడా కరోనా నివారణకు మందు ఆవిష్కరించేందుకు విస్తృతం గా పరిశోధనలు జరుగుతున్నాయి.

హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న భారత్‌ బయోటెక్‌ కరోనా వైరస్‌ కట్టడికి వ్యాక్సిన్‌ ను కనుక్కునేందుకు పరిశోధనలు చేస్తున్నారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌ - మాడిషన్‌ శాస్త్రవేత్తలు - టీకా కంపెనీగా ఉన్న ప్లూజెన్‌ ప్రతినిధులు కూడా ఈ పరిశోధనల్లో భాగస్వాములవుతున్నాయి. వారంతా కలిసి కరోనా వైరస్‌ నివారణకు వ్యాక్సిన్‌ కనుకునేందుకు పరిశోధనలు చేస్తున్నారు. ఆ తయారు చేసిన వ్యాక్సిన్‌ ను ప్రపంచ దేశాలకు పంపిణీ చేస్తామని భారత్‌ బయోటెక్‌ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ సందర్భంగా 30 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ ను తయారుచేస్తున్నారు. ఆ వ్యాక్సిన్‌ రూపొందించాక క్లినికల్‌ పరీక్షలు కూడా చేస్తామని వెల్లడించారు.

పరిశోధనల అనంతరం దానికి అన్ని అనుమతులు పొంది ప్రజలకు అందుబాటులోకి త్వరలో తెచ్చే అవకాశం ఉంది. అయితే కరోనా నివారణకు త్వరగా వ్యాక్సిన్‌ సిద్ధం కావాలని ప్రజలు కోరుతున్నారు. ఆ కరోనా మహమ్మారికి త్వరగా వ్యాక్సిన్‌ రూపొందించేందుకు కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయి. ఆ పరిశోధనలు విజయవంతమై వ్యాక్సిన్‌ త్వరగా రూపొందించాలని మనం ఆకాంక్షిద్దాం.