తగ్గేదేలే.. విశాఖ స్టీల్ ప్లాంట్ పై తేల్చేసిన కేంద్రం.. జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో ?

Wed Jul 21 2021 16:08:56 GMT+0530 (IST)

Bhagwat Kishan Rao On Vizag Steel Plant Privatisation

ఆంధ్రుల హక్కు - విశాఖ ఉక్కు అంటూ ఉద్యమం చేసి రాష్ట్రానికి తీసుకువచ్చిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై మరోసారి కేంద్రం తన వైఖరి ఏమిటో చాలా స్పష్టంగా అందరికి తెలిసేలా పార్లమెంట్ సాక్షిగా చెప్పింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశంలో కేంద్రం తగ్గేదేలే అంటోంది. ఇప్పటికే తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసినా అన్ని పార్టీల నేతలు అభ్యర్ధనలు చేస్తున్నా కార్మికులు పోరాటం ప్రారంభించాన వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేసింది. తాజాగా రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పైన ప్రశ్న సంధించారు.దీనికి కేంద్ర మంత్రి భగవత్ కిషన్ రావు కరాడ్ జవాబిచ్చారు. 100% ప్రైవేటీకరణకు కట్టుబడి ఉన్నామని అందులో తేల్చి చెప్పారు. ప్రైవేటీకరణపై తుది నిర్ణయానికి వచ్చేశాక.. ఇకపై చెప్పేదేమీ లేదని కేంద్రం వైఖరిని కుండబద్దలు కొట్టారు. అయితే ఉక్కు పరిశ్రమ ఉద్యోగులు వాటాదారుల చట్టబద్ధమైన అంశాలను పరిష్కరిస్తామన్నారు భగవత్ కిషన్ రావు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. నిన్న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో నిరసన మంటలు భగ్గుమన్నాయి. 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణ తప్పదన్న ప్రకటనను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి.

160 రోజులుగా ఆందోళన చేస్తున్నామని ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఎంత వరకైనా వెళ్తామంటున్నారు. కేంద్రం ఇప్పటికైనా ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటున్నారు. లేదంటే ఆందోళనను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో ఏపీలో నిరసనలు మరింత ఉధృతంగా కొనసాగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ మిగులు భూములు కేంద్రం దగ్గరే ఉంటాయన్న ప్రకటనపై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

దృష్టి మళ్లించేందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్కి 20వేల ఎకరాల భూమి ఉంది. ఇందులో 8 వేల ఎకరాల్లో కోర్ ప్లాంట్ 5 వేల ఎకరాల్లో టౌన్షిప్ 4 వేల ఎకరాల్లో డీప్ ఫారెస్ట్ ఉందని లెక్కలు చెబుతున్నారు. ఇక మిగులు భూములు ఎక్కడివని ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికే ఇదే అంశం పైన ఏపీ అసెంబ్లీలో ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ ప్రభత్వం తీర్మానం చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని ఉప సంహకరించుకోవాని కోరింది. ముఖ్యమంత్రి నేరుగా ప్రధాని మోదీకి కేంద్ర ఉక్కు శాఖ మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు అప్పట్లోనే లేఖలు రాసారు. అందులో ప్రయివేటీకరణ అవసరం లేకుండానే ఏ రకంగా లాభాల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉందనే అంశాలను వివరించారు.

ఢిల్లీ వెళ్లిన సమయంలో కేంద్ర మంత్రులను కలిసి మరో సారి అభ్యర్ధించారు. ఇక ఈ సమయంలో సీఎం జగన్ కి ఇది రాజకీయంగా అతి పెద్ద సమస్యగా మారింది. సీఎం జగన్ ముందుండి ప్లాంట్ ప్రైవేటీకరణను జరగకుండా చూడాలని ఆయన మార్గంలో నడించేందుకు తాము సిద్దమని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు.

తాజాగా టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలోనూ ప్లాంట్ కు మద్దతుగా టీడీపీ ఎంపీలు రాజీనామాకు సిద్దమని స్పష్టం చేసారు. ఇక పార్లమెంట్ రెండు రోజుల సమావేశాల్లో ఆందోళన చేస్తున్న వైసీపీ సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు.  కానీ కేంద్రం నుండి మాత్రం ఎటువంటి సానుకూల స్పందన రావటం లేదు. ఏపీలో నిరసనలు మరింత ఉధృతంగా కొనసాగుతున్నాయి.

ఈ నిరసనల్లో అన్ని పార్టీ నేతలు పాల్గొంటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం ఈ విషయంలో వెనుకడుగు వేసే అవకాశం కనిపించటం లేదు. దీంతో..ముఖ్యమంత్రి జగన్ దీనిని ఏ రకంగా అడ్డుకోగలుగుతారు అనేది సమాధానం లేని ప్రశ్నగా మారుతోంది. ఇదే అంశాన్ని ఆయుధంగా చేసుకొని టీడీపీ వైసీపీ పై విరుచుకుపడటానికి పక్కా వ్యూహాలతో సిద్ధం అవుతుందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.