బెజెస్ ఎలాన్ మస్క్ కూడా విజయమాల్యా ఫ్రెండ్సేనట

Wed Jun 09 2021 20:00:01 GMT+0530 (IST)

Bezos and Elon Musk are also friends of Vijayamalya

సాధారణ ఉద్యోగులు పన్నులు ఎగ్గొడితేనే అధికారులు చిందులు తొక్కుతారు.. ప్రభుత్వాలు సీరియస్ అయిపోతాయి. కానీ ప్రపంచ స్థాయి కుబేరులుగా చలామణి అవుతున్న వారు కూడా పన్నులు ఎగ్గొడితే!  సెకను సెకనును ఆదాయాన్ని పెంచుకునే ఇంటర్నేషనల్ కంపెనీల దిగ్గజాలు కూడా ప్రభుత్వాలకు మస్కా కొట్టి.. పన్నులు ఎగవేస్తే.. వినేందుకు ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజం. ప్రపంచ స్థాయి కుబేరులు కూడా పన్నులు కట్టకుండా.. తప్పించేసుకున్నారు.అమెజాన్ సీఈవో నుంచి..
అయితే.. ఇది జరిగింది మన దేశంలో కాదు.. అగ్రరాజ్యం అమెరికాలో! టర్నల్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్ఎస్) రికార్డుల ప్రకారం.. ఈ దిగ్గజాల జాబితాలో.. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ బ్లూమ్ బర్గ్ వ్యవస్థాపకుడు మైకేల్ బ్లూమ్ బర్గ్ ఇన్వెస్టర్లు కార్ల్ ఇచాన్ జార్జ్ సోరోస్ వారెన్ బఫెట్  వంటి వారుఉండడంతో ప్రతి ఒక్కరూ నివ్వెర పోతున్నారు. ఇక ఈ పన్నులు ఎగ్గొట్టిన వారి జాబితాను `ప్రో పబ్లికా` అనే వార్తా సంస్థ వెలుగులోకి తెచ్చింది.

కట్టింది 0.1%
2007 2011లలో బెజోస్ 2018లో మస్క్ లు పన్ను ఎగ్గొట్టారట. వారెన్ బఫెట్ కూడా 2014 నుంచి 2018 మధ్య 2430 కోట్ల డాలర్ల సంపదను మూటగట్టుకున్నా.. కేవలం 2.37 కోట్ల డాలర్ల పన్నులే కట్టారని తెలుస్తోంది. ఆయన సంపాదించిన దాంట్లో కట్టిన పన్ను కేవలం 0.1 శాతమేనని ఈ వార్త వెల్లడించింది.

విచారణ షురూ!
ప్రపంచ స్థాయి కుబేరులు పన్నులు ఎగ్గొట్టిన విషయం అగ్రరాజ్యంలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై ఐఆర్ఎస్ కమిషనర్ చార్లెస్ రెట్టింగ్ స్పందించారు. సెనేట్ ఫైనాన్స్ కమిటీ విచారణకు ఆయన హాజరయ్యారు. ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని చెప్పారు. ఆరోపణలపై నిజానిజాలను నిగ్గుతేలుస్తామన్నారు. మహమ్మారి సమయంలో సంపదను అపారంగా పెంచుకున్న వ్యక్తులు.. పన్నులు మాత్రం కట్టడం లేదని సెనేట్ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ రాన్ వైడెన్ అన్నారు.

లీకులపైనా చర్యలు
ఇక పన్నులు కట్టేవారు.. ఎగ్గొట్టేవారి సమాచారాన్ని అమెరికా ప్రభుత్వం అత్యంత రహస్యంగా ఉంచుతుంది. కానీ ఇలా రహస్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని బయటకు లీక్ చేసే విషయం కూడా సంచలనంగా మారింది. దీంతో ఈ లీకులపైనా దర్యాప్తు చేస్తామని రెట్టింగ్ చెప్పారు.  రహస్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని లీక్ చేసిన వారు జైలు శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. ఇక ఇదే విషయాన్ని వైడెన్ కూడా పేర్కొన్నారు. పన్ను కట్టే వారి సమాచారన్ని భద్రంగా ఉంచడం ఐఆర్ఎస్ విధి అని అనధికారికంగా ఆ వివరాలు బయటపడడం చాలా పెద్ద నేరమని అన్నారు. ఆ వివరాలను వెల్లడించిన వారిపై దర్యాప్తు చేయించాలన్నారు. మొత్తానికి కుబేరులు కూడా కక్కుర్తి పడ్డారనే వార్త.. ఇప్పుడు జోరుగా వైరల్ అవుతుండడం గమనార్హం.