కక్కుర్తి: కరోనా కేసులపైనా బెట్టింగ్ లు

Mon Jul 13 2020 11:30:20 GMT+0530 (IST)

Betting on Corona cases

కక్కుర్తిలో కమండలం అంటే ఇదేనేమో.. ఎవరైనా క్రికెట్ లో బెట్టింగ్ లను చూసుంటారు.. ఏదైనా రాజకీయ ఎలక్షన్స్ కార్ రేసు గుర్రపు పందెల్లో బెట్టింగ్ లను చూసుంటారు.. కానీ ఇదే దరిద్రం.. కరోనా కేసులపైనే బెట్టింగ్ లు చేస్తున్నారు కొందరు పనిపాటా లేని బెట్టింగ్ రాయుళ్లు. మనుషుల ప్రాణాలు కేసులతో చేస్తున్న ఈ బెట్టింగ్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కాదేది బెట్టింగ్ కు అనర్హం అన్నట్టు తాజాగా కరోనా కేసులపై కర్ణాటక రాష్ట్రంలో బెట్టింగ్ నడిపిస్తున్నారు. కర్ణాటకలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ప్రస్తుతం విస్ఫోటనంలా కేసులు పెరుగుతున్నాయి. రోజుకు వెయ్యి నుంచి 2వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీన్నే బెట్టింగ్ రాయుళ్లు అవకాశంగా మలుచుకున్నారు.

ప్రస్తుతం కర్ణాటకలో ఈరోజు ఎన్ని కేసులు నమోదువుతున్నాయనే దానిపై జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం హెల్త్ బులిటిన్ విడుదలతో ఈ బెట్టింగ్ కు తెరపడనుంది. కరెక్ట్ గా కేసుల సంఖ్యను చెప్పిన వ్యక్తి ఖాతాలోకి నగదును ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు.  క్రికెట్ బెట్టింగ్ లాగానే కరోనా బెట్టింగ్ లు కర్ణాటకలో చురుకుగా సాగుతున్నాయి.

ఈ బెట్టింగ్ లు కర్ణాటకలోని మైసూర్ చామరాజనగర ఇతర స్థలాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో సాగుతున్నాయని తెలిసింది. ఇక ఈ కరోనా బెట్టింగ్ లో కేవలం రూ.100 రూ.500 రూ1000 మేర తక్కువ మొత్తమే పందెం కాస్తున్నారట. దీంతో దీన్ని పోలీసులు పట్టించుకోవడం లేదని తెలిసింది.